ఏఐపై ట్రంప్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు! | Trump Dismisses AI Alarms As HOAX White House Concerns | Sakshi
Sakshi News home page

ఏఐపై ట్రంప్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!

Sep 15 2026 3:15 AM | Updated on Sep 15 2026 3:15 AM

Trump Dismisses AI Alarms As HOAX White House Concerns

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (ఏఐ)పై వస్తున్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేశారు. ఏఐ సంస్థలపై మరిన్ని ప్రభుత్వ నియంత్రణలు అవసరమన్న పరిశ్రమ ప్రముఖుల డిమాండ్లను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చైనాను ఏఐ రంగంలో వెనక్కి నెట్టడం అమెరికాకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏఐ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ.. సోమవారం సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. ఏఐ వ్యవస్థలు అదుపు తప్పకుండా ఉండేందుకు తన పర్యవేక్షణ సరిపోతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే ఏఐ కంపెనీలపై చర్యలు తీసుకునేంత ప్రభుత్వ నియంత్రణ, చట్టపరమైన అధికారాలు అమెరికాకు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, ఏఐను భారీ ప్రయోజనాలు అందించే విలువైన అవకాశంగా ఆయన అభివర్ణించారు. అయితే మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం, భారీ డేటా సెంటర్లతో స్థానిక ప్రాంతాలపై ప్రభావం, భద్రతాపరమైన ముప్పులు వంటి అంశాలపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో ట్రంప్‌ వైఖరిపై వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాత్రం ఏఐ సంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రణలు విధించాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొత్త నిబంధనల పేరుతో కంపెనీలు తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహం ఉందన్నారు. అయితే ఏఐలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని అంగీకరించిన వాన్స్‌.. వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా చర్యలపై ప్రభుత్వం, కాంగ్రెస్‌ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఏఐ, సైబర్‌ భద్రత అంశాలపై ప్రభుత్వ నిపుణులతో ఈ వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, ఏఐ కంపెనీల బాధ్యత, ప్రభుత్వ పాత్రపై చర్చించేందుకు అమెరికా కాంగ్రెస్‌లోనూ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన సందర్భంగా ఏఐపై ఇరుదేశాల మధ్య చర్చలను మరింత విస్తరించే అవకాశముంది. గతంలో ఏఐ భద్రతపై ట్రంప్‌, షీ చర్చించినప్పటికీ పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. తాజాగా ఏఐ అంశంపై అమెరికా-చైనా ప్రభుత్వ స్థాయి చర్చలు ఏర్పాటు చేయనున్నట్లు చైనా ప్రకటించింది.

ఇదీ చదవండి: ఒమన్‌లో జరగాల్సిన ఇరాన్‌ కీలక భేటీ.. వాయిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement