న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాలు సమున్నతంగా ఎదిగేందుకు పంచ సూత్రావళిని పాటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సరికొత్త సూచనలు చేశారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ ఫ్యాక్టరీలు, సీనియర్ శాస్త్రవేత్తలతో అతిపెద్ద సమీకృత మార్కెట్‌ను బ్రిక్స్ దేశాలు సొంతంగా సృష్టించుకోవాలని జిన్‌పింగ్ అభిలషించారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం జిన్‌పింగ్ మాట్లాడారు.
‘‘అభివృద్ధిచెందుతున్న మార్కెట్లు, గ్లోబల్ సౌత్ దేశాలతో బ్రిక్స్ సభ్య దేశాలు అనుసంధానం కావాలి. దీంతో మన సరకు రవాణా గొలుసులు పటిష్టమవుతాయి. తద్వారా భవిష్యత్తులో అతిపెద్ద సమీకృత మార్కెట్‌ను అవతరింపజేయవచ్చు.
అందుకోసం మొదటగా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటుచేద్దాం. దీని ఏర్పాటుకు చైనా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల తయారీ, అభివృద్ధికి కృషిచేద్దాం. ఏఐ సెమినార్లు నిర్వహిద్దాం. శిక్షణా కోర్సులను అందుబాటులోకి తెద్దాం. అలా ఓపెన్ ఏఐ ఎకోసిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.
ఇక రెండోది వాణిజ్యం, పెట్టుబడులను సులభతరంచేసే వ్యవస్థను ఏర్పాటుచేయడం. ఇందుకోసం బ్రిక్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేద్దాం. దీని ద్వారా ఇంటెలిజెంట్ పోర్టల్, విధానాల రూపకల్పన, కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు అనుగుణంగా వాతావరణం సృష్టించుకోవచ్చు. దీంతో బ్రిక్స్ దేశాల మధ్య వస్తుసేవలు, పెట్టుబడులు పరస్పరం సులభంగా బదిలీఅవుతాయి’’అని జిన్‌పింగ్ అన్నారు.
‘‘ఇక మూడోది. డిజిటల్ పరిశ్రమను బలోపేతంచేయడం. ఇందుకోసం డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, కొత్త సాంకేతికతల మార్పిడి, వివిధ పరిశ్రమల మధ్య సమన్వయం, డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం కృషిజరగాలి’’అని జిన్‌పింగ్ చెప్పారు.
‘‘ఇక నాలుగోది స్మార్ట్ కర్మాగారాలను కొలువుతీర్చడం. రోబోటిక్స్, ఆటోమేషన్‌లతో తయారీరంగాన్ని ఆధునీకరించాలి. ఏఐ, డిజిటల్ సాంకేతికతలను వస్తూత్పత్తి కర్మాగారాల్లో పూర్తిస్థాయిలో ఉపయోగిస్తూ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను సాకారంచేయాలి. అందుకు కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో చైనా కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇంటెలిజెంట్ మ్యానుఫాక్చరింగ్‌లో పారదర్శకత, ఎప్పటికప్పుడు అప్‌డేట్ ముఖ్యం’’అని ఆయన అన్నారు.
‘‘ఇక ఐదోది ఇంజనీర్స్ సృష్టి కూటమి. యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రతిభావంతులైన యువతను బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయంచేస్తూ కొత్త ఇంజనీర్లను తయారుచేద్దాం’’ అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.


