ప్రపంచదేశాల పురోగతికి, శ్రేయస్సుకు అది ఆటంకం కలిగిస్తుంది
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన
మానవాళి కోసం కూటమి ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపు
సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొని మానవాళి కోసం బ్రిక్స్ కూటమి ఉమ్మడిగా కృషి చేయాలని, సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆధునిక సాంకేతికతను, అరుదైన ఖనిజాలను కొన్ని దేశాలు స్వలాభం కోసం అస్త్రాలుగా మార్చుకోవడంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచదేశాల ఉమ్మడి పురోగతికి, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందన్నారు. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, భాగస్వామ్యం ఏర్పర్చుకోవడం వల్ల అవి బ్రిక్స్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. మన వైవిధ్యమే మన గుర్తింపు, మన సహకారమే మన స్ఫూర్తి, మన పురోగతి సకల మానవాళికి సేవగా మారాలని బ్రిక్స్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తున్నాం
అస్థిరమైన భౌగోళిక–రాజకీయ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం బలోపేతం కావడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. కూటమికి భారత్ అధ్యక్షత వహించడం నిబ్బరం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ నాలుగు మూలస్తంభాల ఆధారంగా బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని భారత్ ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే కూటమిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ప్రయోజనాలు కేవలం భారత్‌కే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. కూటమిలో అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దృక్పథాన్ని పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలగడం సంతోషాన్నిస్తోందని మోదీ ఉద్ఘాటించారు.
ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి కాదు
నేడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతున్నారని మోదీ గుర్తుచేశారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాల వంటివి నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని నిరూపించాయని తెలియజేశారు. అందుకే బ్రిక్స్ కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం, తక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమని వివరించారు.
అంటువ్యాధుల నివారణ, వాటిపై స్పందించేందుకు ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి అంగీకరించామని అన్నారు. అలాగే విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక సమాచార అనుసంధాన మార్గదర్శకాలు’రూపొందించినట్లు తెలిపారు. సప్లై చైన్లను మరింత విశ్వసనీయంగా, దృఢంగా మార్చడానికి ‘బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేసన్ ఫ్రేమ్‌వర్క్’ తోడ్పడుతుందని అన్నారు. ఆవిష్కరణల విభాగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్ మన స్టార్టప్‌లను, ఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుందని వెల్లడించారు. ‘బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్’ను ప్రతిపాదించినట్లు స్పష్టంచేశారు. సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు.
‘బ్రిక్స్ కనెక్ట్’తో ఉపాధి అవకాశాలు
బ్రిక్స్ కూటమిలోని వివిధ వేదికల ద్వారా స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించినట్లు ప్రధాని వివరించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య పౌరులను ఇందులో క్రియాశీల భాగస్వాములుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బ్రిక్స్ కనెక్ట్’ద్వారా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పనిలో మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రత, సామర్థ్య పెంపుదల వంటి అంశాలను ప్రోత్సహించామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను పరిజ్ఞానం, ఆర్థిక వనరులు, కొత్త మార్కెట్లతో అనుసంధానించేందుకు ‘బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ కోఆపరేషన్ పోర్టల్’ను ప్రారంభించామని వెల్లడించారు. మన నగరాల మధ్య ఉత్తమ విధానాల పరస్పర బదిలీని సులభతరం చేసేందుకు ‘బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్’ను ఏర్పాటు చేశామన్నారు.
భావి తరాల పట్ల అది మన బాధ్యత
భారతీయ నాగరికతలో ప్రకృతికి కన్నతల్లి స్థానం ఉందని గుర్తుచేశారు. అభివృద్ధి, పర్యావరణం అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాదని, అవి పరస్పర పూరకాలని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నామని ఉద్ఘాటించారు. మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పట్ల కచ్చితంగా సమతుల్యత పాటించాలని తేల్చిచెప్పారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత అని సూచించారు. ఆ దిశగా పలు అంశాల్లో తాము పురోగతి సాధించామన్నారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం ‘బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చడానికి, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ప్రధాని చెప్పారు.


