బెంగళూరు: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) గణేశ విగ్రహాలపై నిషేధం అమల్లోకి రావడంతో విగ్రహ తయారీదారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ఫైబర్ గణేశ విగ్రహాలను అద్దెకు ఇస్తున్నారు. వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్న ఈ విగ్రహాలకు వాటి సైజును బట్టి అద్దె నిర్ణయిస్తున్నారు. ఈ విధానాన్ని పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. పీవోపీ విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.
బెంగళూరుకు చెందిన శ్రీ వినాయక అండ్ కంపెనీ ప్రతినిధి ఎం. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వారి వద్ద సుమారు 50 రకాల ఫైబర్ గణేశ విగ్రహాలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. పీవోపీ విగ్రహాలపై నిషేధం నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొందరు ఇప్పటికే ఫైబర్ విగ్రహాలను అద్దెకు తీసుకున్నారని, ఊరేగింపు అనంతరం దానిని తిరిగి అప్పగిస్తారని, చెరువులో నిమజ్జనం చేయబోరని వివరించారు.
8 నుంచి 10 అడుగుల విగ్రహానికి రోజుకు రూ.3,000 నుంచి.. 18 నుంచి 20 అడుగుల విగ్రహానికి రూ.30,000 వరకు అద్దె ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి, ఒప్పందంపై సంతకం చేస్తే బెంగళూరు నగరం లేదా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా విగ్రహాలను సరఫరా చేస్తామని చెప్పారు. డిపాజిట్ మొత్తం విగ్రహ పరిమాణం, అద్దె కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఫైబర్ విగ్రహాలకు పూజలు నిర్వహించవచ్చని, వాటితోపాటు చిన్న మట్టి గణేశుడిని ఏర్పాటు చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. మట్టి విగ్రహాన్ని నిర్ణీత ప్రదేశంలో నిమజ్జనం చేసి, ఫైబర్ విగ్రహాన్ని తిరిగి ఇవ్వవచ్చన్నారు. బకాయి అద్దెను మినహాయించిన అనంతరం భద్రతా డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ


