లొంగేది లేదు.. సుప్రీం లీడర్‌ బతికే ఉన్నారు: ఇరాన్‌ అధ్యక్షుడి వార్నింగ్‌ | Iran Pezeshkian slams US strikes on civilian targets | Sakshi
Sakshi News home page

లొంగేది లేదు.. సుప్రీం లీడర్‌ బతికే ఉన్నారు: ఇరాన్‌ అధ్యక్షుడి వార్నింగ్‌

Sep 13 2026 9:05 AM | Updated on Sep 13 2026 10:30 AM

Iran Pezeshkian slams US strikes on civilian targets

అమెరికా, ఇజ్రాయెల్‌ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ తేల్చిచెప్పారు. అదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయన తన విధులను కొనసాగిస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. ఖమేనీ ఆచూకీపై వస్తున్న ఊహాగానాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్‌ సృష్టిస్తున్న సమాచార యుద్ధంలో భాగమేనని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన పెజెష్కియాన్‌.. ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

‘దేవుడి దయవల్ల మా సుప్రీం లీడర్‌ బతికే ఉన్నారు. ఆయన తన విధులను కొనసాగిస్తున్నారు’ అని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. అయితే, మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం అమెరికా-ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై తీవ్ర ఊహాగానాలు మొదలయ్యాయి. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దాడుల్లో మరణించిన తర్వాత కూడా మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత కారణమైంది.

సుప్రీం లీడర్‌దే నిర్ణయం..
అయితే, ఖమేనీ ఎక్కడున్నారో గుర్తించలేకపోవడంతోనే అమెరికా, ఇజ్రాయెల్‌ ఆయనపై ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నాయని పెజెష్కియాన్‌ ఆరోపించారు. ఇరాన్‌ నాయకులు, సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని.. అందుకే సుప్రీం లీడర్‌ ఆచూకీని భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. ఇరాన్‌లో తుది నిర్ణయాధికారం మాత్రం సుప్రీం లీడర్‌దేనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ ఒత్తిళ్లకు ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోదని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ సైనిక బలగాలను ఎదుర్కొనే బదులు పౌర మౌలిక వసతులు, ఆహార సరఫరాలు, ప్రజల జీవనోపాధులపై దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఇరాన్‌ను లొంగదీసుకోలేరని, తమ దేశం ఎప్పటికీ లొంగబోదని ఎక్స్‌ వేదికగా తేల్చిచెప్పారు.

అణు కార్యక్రమంపై..
ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలను కూడా పెజెష్కియాన్‌ కొట్టిపారేశారు. తమ అణు కార్యక్రమం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే సాగిందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఇరాన్‌ అణు కార్యకలాపాలను అంతర్జాతీయ సంస్థలు నిరంతరం పర్యవేక్షించాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామన్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. అణు అంశంపై చర్చలకు ఇరాన్‌ సిద్ధంగానే ఉందని తెలిపారు. అయితే అమెరికాతో తక్షణమే ప్రత్యక్ష చర్చలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి అలీ ఖమేనీ హత్య తర్వాత అమెరికాపై ఇరాన్‌లో నమ్మకం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇరాన్‌పై దాడులు నిలిపివేయడంతో పాటు ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు తగినంత పరిశీలన జరగడం లేదని ప్రశ్నించారు.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కోసం ఇరాన్‌, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌ సహా ప్రాంతీయ దేశాలు కలిసి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పెజెష్కియాన్‌ ప్రతిపాదించారు. యుద్ధాల కంటే పరస్పర సహకారం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలే ప్రాంతానికి మేలు చేస్తాయని అన్నారు. యూఏఈతో తమకు ఎలాంటి సమస్య లేదని, పొరుగు దేశాలను సోదర దేశాలుగానే చూస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు తమ సుప్రీం లీడర్‌ బతికే ఉన్నారని స్పష్టం చేస్తూనే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగేది లేదంటూ పెజెష్కియాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. ఖమేనీ ఆచూకీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉండటం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.

ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement