గిజా పిరమిడ్‌లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్‌? | Great Pyramids Mathematical Code May Link to Moon and Stars | Sakshi
Sakshi News home page

గిజా పిరమిడ్‌లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్‌?

Sep 13 2026 7:29 AM | Updated on Sep 13 2026 7:38 AM

Great Pyramids Mathematical Code May Link to Moon and Stars

ఈజిప్టులోని గిజా మహా పిరమిడ్‌ చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించిన గణిత సంకేతాలను కలిగి ఉండొచ్చని స్వతంత్ర పరిశోధకుడు సెఫీ లెవీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పిరమిడ్‌ ఎత్తు, పునాది, వాలుగా ఉన్న భుజాల కొలతల్లో ప్రాచీన ఈజిప్షియన్ల గణితం, ఖగోళ విజ్ఞానంపై అవగాహనకు సూచించే సంఖ్యా నమూనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సిద్ధాంతానికి సంబంధించిన పరిశోధనా పత్రం ఎస్‌ఎస్‌ఆర్‌ఎన్‌లో ప్రచురితమైనప్పటికీ, దీనికి ఇంకా నిపుణుల సమీక్ష (పీర్‌ రివ్యూ) జరగలేదు. ప్రధాన స్రవంతి ఈజిప్టాలజిస్టులు కూడా ఈ వాదనలను ధ్రువీకరించలేదు.

కొలతల్లో గణిత నమూనాలు?
లెవీ ప్రాచీన ఈజిప్టు గణిత విధానాలకు సంబంధించిన భిన్నాలను ఉపయోగించి మహా పిరమిడ్‌ కీలక కొలతలను విశ్లేషించారు. ఈ లెక్కల ద్వారా వచ్చిన కొన్ని సంఖ్యలు ఖగోళ చక్రాలు, గణిత స్థిరాంకాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.

చంద్రుడి కక్ష్యతో సంబంధం?
మెట్రో నివేదిక ప్రకారం.. ఒక లెక్కలో 27.5 అనే సంఖ్య వచ్చింది. ఇది చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి చేరుకునే వరుస సందర్భాల మధ్య ఉండే 27.55 రోజుల వ్యవధికి దగ్గరగా ఉందని లెవీ పేర్కొన్నారు.

నక్షత్రంపైనా వాదన
మరో లెక్కలో 70 అనే సంఖ్య వచ్చినట్లు ఆయన తెలిపారు. సూర్యుడి కాంతి కారణంగా సిరియస్‌ నక్షత్రం కనిపించకుండా ఉండే సుమారు 70 రోజుల వ్యవధితో దీనికి సంబంధం ఉందని చెప్పారు. బృహస్పతి, శని, శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాల కదలికలతోనూ కొన్ని లెక్కలు సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. పైతో పాటు గోల్డెన్‌ రేషియో వంటి గణిత స్థిరాంకాలతోనూ సంబంధం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

 లక్ష నమూనాలతో పరిశీలన
ఈ నమూనాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా అన్నది పరిశీలించేందుకు లెవీ ఒక లక్ష కంప్యూటర్‌ రూపొందించిన పిరమిడ్‌ నమూనాలతో పోల్చినట్లు సమాచారం. వాటిలో సుమారు 2.4 శాతం నమూనాల్లోనే ఇలాంటి నమూనాలు కనిపించాయని ఆయన తెలిపారు.

నిర్ధారణకు ఇంకా ఆధారాలు అవసరం
అయితే ఈ ఫలితం ప్రాచీన ఈజిప్షియన్లు పిరమిడ్‌ను గణిత లేదా ఖగోళ సంకేతంగా నిర్మించారనే విషయాన్ని నిర్ధారించదు. సుమారు 4,500 ఏళ్ల క్రితం ఫరో ఖుఫు పాలనలో మహా పిరమిడ్‌ నిర్మితమైంది.

సమాధికి మించి జ్ఞాన భాండాగారమా?
లెవీ అభిప్రాయం ప్రకారం.. పిరమిడ్‌ కేవలం సమాధిగా కాకుండా ప్రాచీన జ్ఞానాన్ని శాశ్వతంగా భద్రపరిచే నిర్మాణంగా రూపొందించి ఉండొచ్చు. ప్రాచీన ఈజిప్టు సృష్టి పురాణాల్లో పేర్కొన్న ఆదిమ కొండ ‘బెన్‌బెన్‌’తోనూ దీనికి సంబంధం ఉండొచ్చని ఆయన సిద్ధాంతం సూచిస్తోంది.

ఇదీ చదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement