న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాల మధ్య సహకారంలో నూతన అధ్యాయం మొదలైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భూమి∙సహజ ఉపగ్రహమైన చందమామపై స్థావరాన్ని నిర్మించడంలో పాలుపంచుకోవాల్సిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఆహ్వానం పలికింది. జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో ‘‘మూన్ బేస్ మిషన్’’ పేరుతో వ్యోమగాముల నివాస, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్షాన్ని పరిశోధించేందుకు, సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు సైతం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. అంతరిక్ష రంగంలో పరస్పరం సహకరించేందుకు ఉన్న అవకాశాలపై ఇరుదేశాల సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూపులు గత వారం బెంగళూరులో సమావేశమై చర్చలు జరిపాయి. ‘‘మూన్ బేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సిందిగా ఇస్రోను నాసా ఆహ్వానించింది. ఆర్టిమిస్ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతాయి’’ అని ఈ జాయింట్ వర్కింగ్ గ్రూపు తాజాగా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది.


