ముజఫ్ఫర్ నగర్: ఆరోగ్యం సహకరించకపోయినా, వైద్యులు ఎంత వారించినా శివునిపై ఉన్న అచంచల భక్తితో ఓ 80 ఏళ్ల వృద్ధుడు సాహసోపేత యాత్ర పూర్తి చేశారు. ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌కు చెందిన పశురామ్ శర్మ శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా ఆయన ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు.
డాక్టర్లు ఇంట్లోనే ఉండాలని సలహా ఇచ్చినా లెక్కచేయకుండా, తన స్కూటీ వెనుక రెండు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని సుమారు 93 కిలోమీటర్ల ప్రయాణం సాగించారు. జ్వాలాపూర్ నుంచి బయలుదేరి, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్ నగర్‌లోని శివ చౌక్ చేరుకున్నారు. మార్గమధ్యంలో శ్వాస ఇబ్బంది తలెత్తినప్పుడల్లా సిలిండర్ సాయంతో ఆక్సిజన్ తీసుకుంటూ ముందుకు సాగారు.
ముజఫ్ఫర్ నగర్‌లోని శివ చౌక్‌లో ఆశుతోషుడికి జలాభిషేకం చేసి, తన కన్వర్ యాత్రను విజయవంతంగా ముగించారు. అంతకుముందు ఆయన బాగ్పత్‌లోని పురా మహాదేవ్ ఆలయం వరకు వెళ్లాలని భావించారు. అయితే ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటం, అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకెళ్లడం కష్టమని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముజఫ్ఫర్ నగర్‌లోనే శివుణ్ణి దర్శించుకున్నారు. ఇప్పటివరకు ఆయన 13 సార్లు కన్వర్ యాత్ర పూర్తి చేశారు. వయసు, అనారోగ్యం మొదలైనవి తన భక్తికి అడ్డంకి కాలేదని, జీవితంలో ఏ కష్టమొచ్చినా శివుడే తనకు ధైర్యమని పరశురామ్ పేర్కొన్నారు. వృద్ధుడి సంకల్పాన్ని చూసి స్థానికులు, భక్తులు ఆయనను అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బొద్దింకల్లో ‘బ్లింకిట్’ స్టాక్.. లైసెన్స్ రద్దు!


