సౌదీలో అగ్నిప్రమాదం.. 16 మంది బంగ్లాదేశీయులు సజీవదహనం | Tragedy in Riyadh 16 Bangladeshi Workers Killed in Sofa Factory Fire | Sakshi
Sakshi News home page

సౌదీలో అగ్నిప్రమాదం.. 16 మంది బంగ్లాదేశీయులు సజీవదహనం

Aug 10 2026 12:08 PM | Updated on Aug 10 2026 12:33 PM

Tragedy in Riyadh 16 Bangladeshi Workers Killed in Sofa Factory Fire

రియాద్‌: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన  అగ్నిప్రమాదంలో 16 మంది బంగ్లాదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రియాద్‌లోని మూసా సానియా ప్రాంతంలో ఉన్న ఒక సోఫా ఫ్యాక్టరీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 16 మంది బంగ్లాదేశీ జాతీయులు సజీవదహనమయ్యారు.

ఈ దుర్ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను గుర్తించే ప్రక్రియతో పాటు, చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి వారు సౌదీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. మృతదేహాలను త్వరలోనే స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement