తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా? | Priyanka Incident to HYD Hit and Run: Drunk Drive Not Just Traffic Offence | Sakshi
Sakshi News home page

తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?

Aug 10 2026 12:29 PM | Updated on Aug 10 2026 12:35 PM

Priyanka Incident to HYD Hit and Run: Drunk Drive Not Just Traffic Offence

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులు నమోదు అయ్యాయి. హైదర్‌షా కోట్‌ ఘటనలో ఆర్మీ జవాన్‌ మృతి చెందగా.. కొండాపూర్‌ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్‌ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.

ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్‌ దృశ్యం

ప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్‌ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.

  • అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.

  • బ్రిటన్‌లోనూ డ్రంక్‌ డ్రైవింగ్‌పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్‌ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్‌ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.

  • ఆస్ట్రేలియా, సింగపూర్‌, జపాన్‌ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.

లెక్కలు చెబుతున్న భయానక నిజం
మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టడం.. కేవలం ట్రాఫిక్‌ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్‌లో 2022లో డ్రంక్‌ డ్రైవింగ్‌తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.

భారత్‌లో చట్టాలు ఉన్నా.. 
భారత్‌లోనూ డ్రంక్‌ డ్రైవింగ్‌పై చట్టాలు ఉన్నాయి. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.

శిక్ష భయం ఎందుకు రావడం లేదు?
డ్రంక్‌ డ్రైవింగ్‌ అనేది కేవలం ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.

ఇతర దేశాల్లో డ్రంక్‌ డ్రైవింగ్‌పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్‌ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.

హైదర్‌షా కోట్‌ హిట్‌ అండ్‌ రన్‌ దృశ్యం ఇది

భారత్‌లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్‌గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.

మారాల్సింది మనస్తత్వం కూడా..
ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్‌ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement