పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్‌లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..
బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణ
బీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్‌కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.

అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్
ఎన్‌సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్‌సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.
మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్‌గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరం
ఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు.
తిరిగి సొంత గూటికే?
తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్‌సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.
మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్‌సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది.


