ముఖానికి నూనెలు పట్టించుకోవడం భారతీయ సౌందర్యపోషణ పద్ధతుల్లో పురాతన కాలం నుంచి ఉంది. ముఖానికి పూసుకొనే నూనెలు చర్మానికి పోషణను అందించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ముఖానికి రాసుకొనే నూనెల్లో కుంకుమాది తైలం ఎంతో ప్రసిద్ధి చెందింది. చర్మానికి యవ్వనాన్ని, మెరుపును ప్రసాదించేదిగా ఈ తైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దీనిని ఆనాటి ప్రాచీన ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా సైతం ఉపయోగించేదట! ఆధునిక కాలంలో దీనినే గోల్డెన్ సీరమ్‌గా పిలుస్తున్నారు.
పదేపదే తాకవద్దు!
మనం నిర్లక్ష్యం చేసే చిన్నచిన్న అలవాట్లు మన చర్మ సౌందర్యానికి ఎంతగానో హాని చేస్తాయి. అదే తరచుగా ముఖాన్ని చేతివేళ్లతో తాకడం. ఒక వ్యక్తి సగటున గంటకు 23 సార్లు తన ముఖాన్ని తాకుతుంటాడని కొన్ని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల చేతిపై ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి నేరుగా చర్మ రంధ్రాల్లోకి చేరుతుంది. అలాగే ఫోన్ స్క్రీన్‌ను చెంపకు ఆనించి ఉంచడం వల్ల దానిపైన ఉండే క్రిములు, దుమ్ము నేరుగా చర్మ రంధ్రాల్లోకి చేరిపోతాయి.
దీనివల్ల చర్మంపై మొటిమలు, నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ వైప్స్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో ఫోన్‌ను తరచుగా తుడుస్తుండాలి. అంతేకాకుండా ముఖాన్ని పదేపదే చేతులతో రుద్దడం వల్ల కొలాజెన్ తగ్గిపోయి చర్మం సాగిపోతుంది. అందువల్ల ఫోన్‌ను తరచుగా శుభ్రం చేసుకోవడం, చేతివేళ్లను ముఖానికి ఆనించడం వంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవడం ద్వారా సగం చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.
(చదవండి: సీతాఫలం... పోషకాల సిరులఫలం)


