వంటింట్లోనే రెస్టారెంట్ రుచి.. ఈ రెసిపీలు ట్రై చేయండి! | Jackfruit Dum Biryani Bitter Gourd Fry Sabudana Vada Recipes | Sakshi
Sakshi News home page

వంటింట్లోనే రెస్టారెంట్ రుచి.. ఈ రెసిపీలు ట్రై చేయండి!

Aug 9 2026 1:02 PM | Updated on Aug 9 2026 1:02 PM

Jackfruit Dum Biryani Bitter Gourd Fry Sabudana Vada Recipes

స్నాక్‌ సెంటర్‌

రోజూ ఒకే రకమైన వంటకాలతో బోర్‌ కొడుతుందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే రుచికరమైన వంటకాలను ట్రై చేయండి. పనసకాయ దమ్‌ బిర్యానీ, ఆకాకరకాయ వేపుడు, సబుదానా వడ.. మూడు వంటకాలూ రుచితో పాటు మీ భోజనానికి మంచి వెరైటీని తీసుకొస్తాయి.

సబుదానా వడ
కావలసినవి:
సగ్గుబియ్యం: కప్పు,
బంగాళాదుంపలు: 2 పెద్దవి (ఉడికించి మెత్తగా చిదుముకోవాలి),
వేయించిన పల్లీల పొడి: 1/2 కప్పు,
పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి),
అల్లం తరుగు: టీస్పూన్,
జీలకర్ర: టీస్పూన్,
నిమ్మరసం:  టీస్పూన్,
కొత్తిమీర తరుగు: 2 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా,
నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ:

  • ముందుగా సగ్గుబియ్యాన్ని 2–3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.

  • తర్వాత అదనంగా ఉన్న నీటిని వంపేయాలి.

  • తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో బాగా నానిన సగ్గుబియ్యం, ఉడికించి, చిదుముకున్న బంగాళాదుంపలు, పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.

  • చేతులకు కొద్దిగా నూనె లేదా నీళ్లు రాసుకుని, మిశ్రమాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టి వడలాగా ఒత్తుకోవాలి.

  • మందం ఎక్కువగా లేకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేడి చేసి.. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వడలను ఒక్కొక్కటిగా వేయాలి.

  • ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి, తర్వాత రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి సబుదానా వడ రెడీ!

పనసకాయ దమ్‌ బిర్యానీ
కావలసినవి:
పచ్చి పనసకాయ ముక్కలు: 250 గ్రాములు,
బాస్మతీ బియ్యం: రెండు కప్పులు (నానబెట్టినవి),
పెరుగు: 1/2 కప్పు,
అల్లంవెల్లుల్లి పేస్ట్‌: ఒకటిన్నర టీ స్పూన్,
కారం: సరిపడా,
పసుపు: 1/2 టీ స్పూన్,
బిర్యానీ మసాలా: ఒకటిన్నర టీ స్పూన్,
ధనియాల పొడి: టీ స్పూన్,
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి ఫ్రై చేసినవి),
పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి),
పుదీనా, కొత్తిమీర: గుప్పెడు,
హోల్‌ బిర్యానీ దినుసులు, నెయ్యి, నూనె: సరిపడా,
నిమ్మరసం: టేబుల్‌ స్పూన్,
ఉప్పు: రుచికి సరిపడా.

తయారీ:

  • ఇందుకోసం కుక్కర్‌లో పనసకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, పసుపు, పావు టీస్పూన్‌ ఉప్పు వేసి మీడియం మంటపై ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించి నీళ్లు వడకట్టండి.

  • తరువాత ఈ పనస ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, సగం ఫ్రైడ్‌ ఆనియన్స్‌, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, సరిపడా ఉప్పు, స్పూన్‌ నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్‌ చేయండి.

  • మరొక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి, అందులో షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, స్పూన్‌ నూనె వేయండి.

  • నీళ్లు మరిగాక నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి 70 శాతం వరకు ఉడికించి నీళ్లను వడకట్టండి.

  • అనంతరం బిర్యానీ పాత్రలో 2 స్పూన్ల నూనె, స్పూన్‌ నెయ్యి వేసి మ్యారినేట్‌ చేసిన పనసకాయ ముక్కలను వేసి సన్నని మంటపై 5 నిమిషాలు మగ్గనివ్వండి.

  • దీనిపైన ఉడికించిన బాస్మతీ బియ్యాన్ని లేయర్‌గా పరవండి. దానిపైన మిగిలిన ఫ్రైడ్‌ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేయండి.

  • మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా 5 నిమిషాలు మీడియం మంటపై, ఆ తర్వాత 10–12 నిమిషాలు సన్నని మంటపై దమ్‌ చేయండి. అంతే çఘుమఘుమలాడే పనసకాయ దమ్‌ బిర్యానీ రెడీ!

ఆకాకరకాయ వేపుడు
కావలసినవి:
ఆకాకరకాయలు: 250 గ్రాములు (సన్నగా కట్‌ చేసిన ముక్కలు),
ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది),
పసుపు: 1/2 టీస్పూన్,
కారం: రుచికి తగినట్లు,
ధనియాల పొడి: టీస్పూన్,
వెల్లుల్లి రెబ్బలు: 6 (కచ్చాపచ్చాగా దంచినవి),
ఉప్పు: రుచికి సరిపడా,
నూనె: 3 టేబుల్‌ స్పూన్లు,
తాళింపు గింజలు: టీస్పూన్,
ఎండుమిర్చి: 2,
కరివేపాకు: ఒక చిన్న రెమ్మ.

తయారీ:

  • ఆకాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాల్లా లేదా పొడవు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

  • తరువాత ఒక మూకుడులో నూనె వేడి చేసి కట్‌ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. 

  • ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై దోరగా వేయించండి.

  • ముక్కలు సగం వేగాక, వాటిని బాణలికి ఒకవైపు జరిపి, మిగిలిన నూనెలో తాళింపు గింజలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించండి.

  • తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

  • ఇప్పుడు ఉల్లిపాయలు, ఆకాకరకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి.

  • చివరగా కారం, ధనియాల పొడి వేసి.. ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి దించేయండి.

  • వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఫ్రైౖ తింటే చాలా రుచిగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement