ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మైదాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్‌లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్నివ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి.
వరంగల్‌లో వేడుకలు..
వరంగల్ కాశిబుగ్గ తిలక్‌రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు.
– హన్మకొండ కల్చరల్


