శ్వేతాశ్వం..! ప్రేమ కోసం శ్మశానానికి వెళ్లిన రాజకుమారి.. | Funday Special Children's Inspirational Story Written By Degala Anithasuri | Sakshi
Sakshi News home page

శ్వేతాశ్వం..! ప్రేమ కోసం శ్మశానానికి వెళ్లిన రాజకుమారి..

Aug 9 2026 11:31 AM | Updated on Aug 9 2026 11:31 AM

Funday Special Children's Inspirational Story Written By Degala Anithasuri

పిల్లల కథ

కుండిన రాజ్యం రాజు ప్రతాపవర్మకు కాంచనవల్లి ఒకతే కూతురు. ఆమెకు అన్ని విద్యలూ నేర్పాడు. తనకు కొడుకులు లేరని తెలిస్తే, పొరుగు రాజ్యాల రాజులు ఎక్కడ దండెత్తి వస్తారోననే భయంతో తనకు ఏకైక కుమారుడు ఉన్నట్లు, అతడి పేరు కాంచనవర్మ అని లోకాన్ని మభ్యపెట్టసాగాడు.

కాంచనవల్లి తరచుగా మగవేషంలో వనవిహారానికి, దేశాటనకు వెళుతూ వుండేది. అలా ఒకసారి తన భటులు, మగవేషం ధరించిన కొందరు చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళినప్పుడు ఒక పచ్చగడ్డి బయలులో గడ్డిమేస్తున్న మేలుజాతి శ్వేతాశ్వం కనిపించింది.

దాన్నిచూసి ముచ్చటపడిన కాంచనవల్లి– తన భటులకుచెప్పి, అశ్వశాలకు తరలించింది. ఆరాత్రి ఎంతసేపటికీ ఉదయం అడవి నుంచి తెచ్చిన శ్వేతాశ్వం మీది ఆలోచనలే కలుగుతుండటంతో ఒకసారి చూడాలని అశ్వశాలకు వెళ్ళింది. కాని, అక్కడ గుర్రానికి కట్టిన తాడు మాత్రమే ఉంది తప్ప, గుర్రం కనిపించలేదు. అశ్వశాల కాపలాదారును అడిగితే, వణికిపోతూ తాను జాగ్రత్తగానే కాపలా ఉన్నానని, కానీ గుర్రం ఎలా మాయమైందో తెలియలేదని చెప్పాడు. యువరాణి మర్నాడు తగిన చర్యలు తీసుకోవచ్చని, తన మందిరానికి తిరిగివచ్చి నిద్రపోయింది.

ఉదయాన్నే అశ్వశాల కాపలాదారు పరుగు పరుగున వచ్చి, గుర్రం అశ్వశాలలోనే ఉందని చెప్పాడు. కాంచనవల్లి వెళ్ళి గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా చీకటిపడగానే అశ్వశాల దగ్గర రహస్యంగా కాపుకాసి గుర్రాన్నే పరికిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఎవరూ లేని సమయంలో శ్వేతాశ్వం ఒక అందమైన రాజకుమారుడిగా మారి ఆకాశంలోకి ఎగిరెళ్ళిపోయాడు. ఆశ్చర్యంతో ఇదంతా గమనించిన కాంచనవల్లి మర్నాడు సాయంత్రమే గుర్రాన్ని తనమందిరంలో కట్టేయించింది. చీకటివేళకి గుర్రం మనిషిగా మారే సమయంలో పెద్ద పంజరంలో ఎగరనివ్వకుండా బంధించి ‘ఎవరు నువ్వు?’ అని అడిగింది.

దానికతను గిర్రున తిరుగుతూ, ‘నేను మాళవరాజ్య యువరాజును. ఒక గంధర్వకాంత అడవిలో విహరిస్తుండగా, తనను చూసినందుకు ప్రతిరాత్రి మనిషిగా మారి ఆకాశంలో గిరికీలు కొట్టమని, పగలు శ్వేతాశ్వంగా బతకమని నన్ను శపించింది’ అని చెప్పాడు. అతని కథ విని విచారించిన కాంచనవల్లి, శాపవిమోచనం గురించి అడిగింది.
‘ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో ఒకరాత్రి నిద్రచేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నాకు శాపవిమోచనం కలుగుతుందని గంధర్వకాంత చెప్పింది. అలాంటి అమ్మాయి కోసం ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నాను. కానీ, భయంవల్ల ఎవరూ సాహసించడం లేదు’ అని చెప్పి వాపోయాడు రాజకుమారుడు.

అప్పుడు కాంచనవల్లి నవ్వి ‘త్వరలోనే నీకోరిక నెరవేర్చుతాను’ అని పలికి తన మందిరంలోనే అశ్వాన్ని వుంచి కాపలాదారుల్ని పెట్టింది.
మరునాటి రాత్రి యువరాణి కనిపించక రాజు, రాణి కంగారు పడ్డారు. సైనికులు నలుదిక్కులా వెదకడానికి వెళ్ళారు. తెలతెలవారుతుండగా కాంచనవల్లి తానే గుర్రంపైన కోటలోకి ప్రవేశించింది. అదిచూసి రాజు ‘రాత్రంతా ఏమైపోయావు’ అని కంగారుగా అడిగాడు. ఆమె నేరుగా శ్వేతాశ్వం దగ్గరికెళ్ళి ’ఈ గుర్రాన్ని పెళ్ళికొడుకులా అలంకరించండి. రాత్రికి నేను పెళ్ళాడుతాను’ అని చెప్పి, తన మందిరానికి వెళ్ళి వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది.

అందరూ అయోమయంతో పెళ్ళిసన్నాహాలు పూర్తిచేశాక, చీకటివేళ పీటమీద నిలబడ్డ గుర్రం రాజకుమారుడిగా మారాడు. వెంటనే కాంచనవల్లి తన మెడలో తాళి కట్టి శాప విమోచన పొందమని చెప్పగానే, రాజకుమారుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అప్పుడు కాంచనవల్లి, తాను రాత్రంతా ఈ యువరాజుని శాపవిముక్తుడిని చేసి పెళ్ళాడాలని సంకల్పించుకుని, శ్మశానంలో ఒంటరిగా గడిపి వచ్చానని చెప్పింది.
యువరాజుకి శాపవిముక్తి కలిగి మరెపుడూ అశ్వంగా మారలేదు. మాళవ రాజ్యంతో పాటు  కాంచనవల్లితో కలిపి కుండిన రాజ్యాన్ని కూడా కలుపుకుని చాలాకాలం హాయిగా పరిపాలన సాగించాడు.
- డేగల అనితాసూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement