గ్వారావో: చైనాలోని గ్వారావో (Guurao) నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ‘అండర్‌వేర్ సిటీ’గా పిలుస్తారు. ఇక్కడ కేవలం అండర్‌వేర్లు, బ్రా, బనియన్‌ల తయారీ పరిశ్రమపైనే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ప్రతిరోజూ లక్షలాది ఇన్‌వర్‌వేర్లు తయారయ్యే ఈ నగరంలో ఏటా సుమారు 35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్‌వేర్‌లు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇక్కడి పారిశ్రామిక ఉత్పత్తిలో అండర్‌వేర్ రంగానికి దాదాపు 80 శాతం వాటా ఉంది. 1982లో ప్రారంభమైన ఈ పరిశ్రమ హాంకాంగ్, తైవాన్ పెట్టుబడుల సహాయంతో క్రమంగా విస్తరించి, 1995-2005 మధ్య కాలంలో భారీ పారిశ్రామిక కేంద్రంగా అవతరించింది. అయితే, కేవలం ఒకే రకమైన పరిశ్రమపై పూర్తిగా ఆధారపడటం ఆ నగరానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, గిరాకీకి తగినట్లుగా ధరలు పెంచలేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
దీనికితోడు, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తయారీ ఖర్చులు తక్కువగా ఉన్న ఆ ప్రాంతాలకు ఆర్డర్లు తరలిపోతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గి, స్థానిక ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోలేకపోతే, కేవలం ఒకే రంగంపై ఆధారపడిన ఇటువంటి ‘వన్-ఇండస్ట్రీ టౌన్‌లు’ భవిష్యత్తులో తీవ్ర సంక్షోభాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ!


