భారత్‌పై 100 శాతం టారిఫ్‌.. తిప్పలు అమెరికాకే? | US Senator Rand Paul Warns Against Imposing 100% Tariffs on India and China | Sakshi
Sakshi News home page

భారత్‌పై 100 శాతం టారిఫ్‌.. తిప్పలు అమెరికాకే?

Aug 8 2026 12:09 PM | Updated on Aug 8 2026 12:24 PM

100 Percent Tariffs on India China Bill: US Senator Warns

రష్యా చమురు వంకతో.. భారత్‌, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్‌ సెనేటర్‌ రాండ్‌ పాల్‌ హెచ్చరించారు. భారీ టారిఫ్‌లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.

రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్‌లో చర్చ సందర్భంగా భారత్‌, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్‌ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్‌ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్‌ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్‌ రాండ్‌ పాల్‌.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

“భారం అమెరికన్లపైనే పడుతుంది”
టారిఫ్‌ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్‌ వాదనను రాండ్‌ పాల్‌ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

“100 శాతం టారిఫ్‌లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

భారత్‌తో సంబంధాలపై ప్రభావం?
భారత్‌ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్‌ పాల్‌.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్‌ రాన్‌ వైడెన్‌ కూడా ఈ టారిఫ్‌ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.

రష్యా చమురు కొనుగోళ్లే కారణం
రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్‌, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్‌లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.

ట్రంప్‌ విధానాలపై చర్చ
గతంలో కూడా రష్యా నుంచి భారత్‌ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.

ప్రస్తుతం 100 శాతం టారిఫ్‌ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్‌పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement