పుతిన్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా | US Intel Warns Putin Could Strike A NATO Ally In A Limited Attack To Test The Alliance Unity, More Details Inside | Sakshi
Sakshi News home page

పుతిన్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా

Aug 8 2026 7:30 AM | Updated on Aug 8 2026 10:36 AM

US Intel Reports Putin Could Strike NATO Allies

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా నిఘా వర్గాల సంచలన ఆరోపణలు చేశాయి. పుతిన్‌.. నాటో కూటమి ఐక్యతను, దాని సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆ కూటమిలోని ఓ సభ్యదేశంపై పరిమిత స్థాయి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాల పేర్కొంటున్నాయి. సైబర్‌ దాడులు, రహస్య కార్యకలాపాలు, హైబ్రిడ్‌ ఆపరేషన్లు లేదా చిన్న స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఈ చర్య ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం నివేదించింది.

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉన్నంతకాలం నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్‌ ప్రయత్నించరని గతంలో అమెరికా అధికారులు భావించారు. అయితే, తాజాగా ఆ అంచనాలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు రష్యా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసు​కోవడం, యుద్ధంలో రష్యా భారీ నష్టాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలను అమెరికా నిఘా వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

రష్యా చర్యకు దిగితే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కంటే నాటోలోని దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, కూటమి స్పందనను పరీక్షించడమే లక్ష్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలు 2026 నవంబర్‌ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాటో ఆర్టికల్‌ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అలా జరిగితే రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.

అలాంటి పరిస్థితుల్లో నాటో ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే కీలకంగా మారనుంది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటో ఇప్పటికే స్పష్టం చేసింది. వివిధ రకాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైనప్పుడు నిరోధించేందుకు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో ప్రతినిధి కల్నల్‌ మార్టిన్‌ ఓ డొన్నెల్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా అమెరికా కీలక ఆయుధాల నిల్వలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు సంవత్సరాలుగా అందించిన సైనిక సహాయం, ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన సైనిక చర్యల కారణంగా కొన్ని కీలక ఆయుధాల నిల్వలు తగ్గినట్లు అధికారులు, రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రెసిషన్‌ స్ట్రైక్‌ మిసైల్స్‌, ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్స్‌ (ATACMS), స్టింగర్‌ క్షిపణులతో పాటు పేట్రియాట్‌, SM-3, THAAD వంటి వాయు రక్షణ ఇంటర్‌సెప్టర్ల నిల్వలపైనా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడితే దాని ప్రభావం యూరప్‌కే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థపై పడే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement