ఇది ఏఐ ఆధారిత చిత్రం
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
టర్కీ, పాకిస్థాన్‌తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’
సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.
మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!
ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?
ఇరాన్‌తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.
ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.
భారత్-పాక్ కోణంలోనూ చర్చ
ఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్‌పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.
మారుతున్న సమీకరణాలు
పాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్‌లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


