ఆ గ్రామంలోని ఓ సాధారణ బావి.. గత ఐదు రోజులుగా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. గాలి లేదు.. వర్షం లేదు.. ఎవరూ తాకడం లేదు.. అయినా బావిలోని నీరు సముద్రంలా అలలు ఎగురేస్తూనే ఉంది. ఈ వింతను చూసిన గ్రామస్థులు మొదట భయంతో వణికిపోయారు. భూకంపం రాబోతోందా? అంటూ ఆందోళన చెందారు.
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక 18 అడుగుల లోతైన బావి గత ఐదు రోజులుగా నిరంతరం అలలు, తరంగాలతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో, వార్త క్షణాల్లో వ్యాపించడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని, ఆ అద్భుతాన్ని తమ కళ్లారా వీక్షిస్తున్నారు. మరోవైపు.. బావి యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 2న ఆయన పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు అలలతో కదులుతూ బయటకు పొర్లిపోతున్నట్లు గమనించారు. మూడు నెలల క్రితమే ఈ బావిని తవ్వినట్టు చెప్పుకొచ్చారు.
అయితే, ఈ మిస్టరీకి నిపుణులు ఇచ్చిన వివరణ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా నిండిపోయాయి. రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి బయటకు రావడంతో బావిలో నిరంతరం అలలు ఏర్పడుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఈ వింత వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన బావి... ఇప్పుడు అలలతో ఉప్పొంగుతోంది. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమా? లేక ఇంకా వెలుగులోకి రాని మరో రహస్యమా? సమాధానం కోసం అందరి చూపు ఇప్పుడు ఆ బావిపైనే ఉంది!
Well Water Continues to Oscillate in #Morbi Village; Collector Orders Probe#Gujarat #India 🇮🇳 pic.twitter.com/eZYwUKNvqV
— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2026
ఇక, మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఈ ఘటనపై వెంటనే స్పందించి, బావిలో ఐదు రోజులుగా కనిపిస్తున్న అలల విషయాన్ని గుజరాత్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు గాంధీనగర్ నుంచి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని ఘటన స్థలానికి పంపించాలని ఆదేశించారు. నిపుణుల బృందం బావిని పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వింతకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.


