శివసాగర్: అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరద ఉద్ధృతి తీవ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య 95కి చేరింది. సుమారు 1.6 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. 563 గ్రామాలు నీటమునిగాయి. శివసాగర్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఒక్క శివసాగర్‌లోనే 57 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. గోలఘాట్‌లో 34 వేల మంది, జోర్హాట్‌లో 25 వేల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని 14 జిల్లాలకు యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. గౌహతిలోనూ పలు ప్రాంతాలు నీటమునిగాయి. రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల కోసం 45 శిబిరాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 12,300 మందికి పైగా అక్కడ తలదాచుకున్నారు.
మరోవైపు 32 వేల మందికి పైగా బాధితులకు బియ్యం, ఉప్పు, పప్పులు వంటి నిత్యావసరాలను అందించేందుకు 59 పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. అస్సాం వరద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అస్సాంలో పర్యటించి, సీఎం హిమంత బిస్వా శర్మతో కలిసి వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించారు. నష్టం తీవ్రంగా ఉన్నందున పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నడ్డా తెలిపారు. ఆస్తి నష్టానికి సంబంధించి ఆర్థిక సహాయం, పరిహారం అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఇది కూడా చదవండి: ‘మెటా’పై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు


