రియల్‌ బాహుబలి.. 2000 మందిని కాపాడిన యంగ్‌ హీరో | Class 10 Dropout Shravan Team Rescues 2000 In Assam Floods | Sakshi
Sakshi News home page

రియల్‌ బాహుబలి.. 2000 మందిని కాపాడిన యంగ్‌ హీరో

Aug 2 2026 12:32 PM | Updated on Aug 2 2026 1:01 PM

Class 10 Dropout Shravan Team Rescues 2000 In Assam Floods

వరద వస్తే చాలామంది ముందుగా తమ కుటుంబాన్ని, తమ ఇంటిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ అసోంలోని ఓ 25 ఏళ్ల యువకుడు మాత్రం తన ఇంటి గురించి ఆలోచించకుండా.. వేలాది మంది ప్రాణాల కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. ఫలితంగా ఐదు గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 2,000 మందికి ప్రాణదాతగా మారాడు. ఇప్పుడు అతడి కథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

అసోంలోని శివసాగర్ జిల్లా నజీరా ప్రాంతానికి చెందిన శ్రవణ్ కుమార్ ప్రతి వర్షాకాలంలో తెల్లవారుజామున దిఖో నది ఒడ్డుకు వెళ్తాడు. వరదల్లో కొట్టుకొచ్చే చెట్ల దుంగలను సేకరించి వాటిని ఇంధనంగా, కొంత ఆదాయ వనరుగా ఉపయోగించడం అతడి కుటుంబానికి అలవాటు. జూలై 19న కూడా తెల్లవారుజామున 3 గంటలకు నది వద్దకు వెళ్లిన శ్రవణ్‌కు ఆ రోజు ఏదో అసాధారణం కనిపించింది. భారీ చెట్ల దుంగలు ఊహించని వేగంతో ప్రవహించడం చూసి.. ‘పెద్ద ప్రమాదం వస్తోంది’ అని అతడు వెంటనే గ్రహించాడు. కొద్ది గంటల్లోనే అతడి అంచనా నిజమైంది. వరద నీరు గ్రామాలపై విరుచుకుపడింది. అతడి సొంత ఇంట్లోకి నీరు చేరింది. తల్లి, సోదరుడు ఇంటి సామాన్లను కాపాడుకునేందుకు పరుగులు తీస్తుండగా.. శ్రవణ్ మాత్రం ఇంటికి వెళ్లలేదు. ‘నేను మా ఇంటికి వెళ్లి ఉంటే.. మిగతా వాళ్లను కాపాడేందుకు ఎవరూ ఉండేవారు కాదు’ అని అతడు చెప్పిన ఒక్క మాట అతడి త్యాగాన్ని తెలియజేస్తోంది.

పదో తరగతి వరకు మాత్రమే చదివిన శ్రవణ్‌కు ఎలాంటి రెస్క్యూ శిక్షణ లేదు. మోటార్ బోట్ లేదు. అతడి వద్ద ఉన్నది కేవలం సంప్రదాయ చెక్క పడవ ‘తులుంగా నావ్’, నదిపై చిన్ననాటి నుంచి వచ్చిన అనుభవం మాత్రమే. కొందరు స్నేహితులను వెంటబెట్టుకుని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉప్పొంగుతున్న వరదలోకి దిగిపోయాడు. ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా సహాయక చర్యలు కొనసాగించారు. మునిగిపోతున్న ఇళ్లలో చిక్కుకున్న చిన్నారులు, నడవలేని వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారిని ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. నీరు పైకప్పుల వరకు చేరడంతో కొందరు ఇళ్ల సీలింగ్‌లో దాక్కోవాల్సి వచ్చింది. వారిని కూడా బయటకు తీసుకొచ్చారు.

రాత్రి చీకట్లో, విద్యుత్ లేకుండా, వరదలో కొట్టుకొస్తున్న భారీ చెట్ల దుంగల మధ్య చిన్న చెక్క పడవలో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో తెలిసినా.. శ్రవణ్, అతడి బృందం వెనక్కి తగ్గలేదు. ఒక గ్రామం కాదు.. ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి దాదాపు 2,000 మంది ప్రాణాలను కాపాడారు. ఈ వరదలతో శివసాగర్ ప్రాంతంలో రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇళ్ల పైకప్పులపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో శ్రవణ్ బృందం ఆశాకిరణంలా మారింది.

తాజా సమాచారం ప్రకారం అసోంలో వరద పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ.. ఇంకా 1.78 లక్షల మంది వరద ప్రభావంలోనే ఉన్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. సినిమాల్లో మాత్రమే కనిపించే హీరోలు నిజ జీవితంలో కూడా ఉంటారని శ్రవణ్ కుమార్ నిరూపించాడు. సొంత ఇల్లు, కుటుంబం కంటే ముందు వందలాది కుటుంబాల ప్రాణాలను కాపాడాలని తీసుకున్న నిర్ణయం.. అతడిని అసోం ప్రజల దృష్టిలో నిజమైన హీరోగా నిలబెట్టింది. అతడి ధైర్యం, సేవాభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా స్ఫూర్తిగా మారుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement