బిలాయిగఢ్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పోషణ కోసం కశ్మీర్‌కు వెళ్లిన యువకులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. సక్తి జిల్లా బుందేలీ గ్రామానికి చెందిన దీపక్ రాత్రే (24), అలాగే సారాగఢ్-బిలాయిగఢ్ జిల్లా ఛుయియా గ్రామానికి చెందిన భూపేంద్ర భైనా (28) ఉపాధి కోసం కొన్ని నెలల క్రితం జమ్ముకశ్మీర్‌కు వలస వెళ్లారు. కుల్గామ్ ప్రాంతంలోని ఒక ఇటుక బట్టీలో వారు పనిచేస్తున్నారు.
శుక్రవారం రాత్రి అక్కడకు వచ్చిన ఉగ్రవాదులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీపక్ రాత్రే కుటుంబానికి అతడే ఏకైక ఆధారం. ఆయనకు భార్య, నాలుగు నెలల కుమారుడు, వృద్ధురాలైన తల్లి, దివ్యాంగుడైన తమ్ముడు ఉన్నారు. తండ్రి అప్పటికే మరణించగా, కుటుంబ భారాన్ని మోస్తున్న దీపక్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మరోవైపు, భూపేంద్ర భైనా కూడా తన నలుగురు సంవత్సరాల కుమారుడిని ఇంట్లో ఉంచి, కష్టాల నుంచి గట్టెక్కడానికి కశ్మీర్‌కు వెళ్లాడు.
ఈ వార్త తెలియడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, మృతదేహాలను వారి స్వగ్రామాలకు రప్పించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: మాస్కోలో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి


