కారుణ్య నియామకాల్లో కూతుళ్లకూ సమాన హక్కు! | Supreme Court Key Verdict On Compassionate Employment | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాల్లో కూతుళ్లకూ సమాన హక్కు!

Aug 2 2026 9:43 AM | Updated on Aug 2 2026 9:43 AM

Supreme Court Key Verdict On Compassionate Employment

సాక్షి, న్యూఢిల్లీ: కారుణ్య నియామకాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కల్పించే క్రమంలో కుమారులు, కుమార్తెల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కారుణ్య నియామక నిబంధనలు పురుషులతో పాటు మహిళలకూ సమానంగా వర్తించేలా ఉండాలని స్పష్టంచేసింది. 

కారుణ్య నియామకాల నిబంధనల్లో కేవలం కుమారులను, పెళ్లికాని కుమార్తెలను మాత్రమే చేర్చి వివాహిత లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్‌ 15 (లింగ, కుల, మత వివక్షల నిషేధం)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. వివాహమైనంత మాత్రాన కుమార్తెలు తల్లిదండ్రుల కుటుంబంలో భాగం కారని భావించడం సరికాదని కోర్టు తప్పుబట్టింది. కారుణ్య నియామకాల పథకంలో లింగ వివక్షకు తావులేదని స్పష్టంచేసింది. 

నిబంధనల సవరణకు ఆదేశం  
పలు రాష్ట్రాల సరీ్వస్‌ రూల్స్, కారుణ్య నియామక మార్గదర్శకాల్లో ఇప్పటికీ కాలం చెల్లిన నిబంధనలున్నాయని న్యాయస్థానం గుర్తుచేసింది. విడాకులు పొందిన, వితంతువులైన కుమార్తెలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు నిబంధనల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉద్యోగి హఠాన్మరణంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోర్టు సూచించింది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారసుల్లో అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement