ఆకలి.. అవమానమే మిగిలింది! | Spain deploys floating barrier in Ceuta after migrant surge | Sakshi
Sakshi News home page

ఆకలి.. అవమానమే మిగిలింది!

Aug 2 2026 8:16 AM | Updated on Aug 2 2026 8:21 AM

Spain deploys floating barrier in Ceuta after migrant surge

యూరప్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న వేలాది మంది వలసదారుల ఆశలు స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికా భూభాగం సెఉటా (Ceuta) వద్దే ఆగిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు..‘సరిహద్దు దాటితే యూరప్‌లోకి సులభంగా వెళ్లొచ్చు’ అనే ప్రచారాన్ని నమ్మి సముద్రాన్ని ఈదుకుంటూ, కంచెలు దాటి సెఉటాలోకి ప్రవేశించిన వేలాది మంది ఇప్పుడు తీవ్ర నిరాశతో తిరిగి మొరాకోకు వెళ్తున్నారు. అక్కడ తమకు ఎదురైనది కొత్త జీవితం కాదు.. ఆకలి, అలసట, అనిశ్చితి మాత్రమేనని వలసదారులు చెబుతున్నారు.

జూలై చివరి వారంలో సోషల్ మీడియాలో సెఉటా సరిహద్దు దాటుతున్న వలసదారుల వీడియోలు వైరల్ కావడంతో మొరాకోలోని అనేక ప్రాంతాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు సముద్రాన్ని ఈదుకుంటూ, మరికొందరు భద్రతా కంచెలను దాటి స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు. యూరప్‌లో ఉద్యోగాలు, మెరుగైన జీవితం దొరుకుతుందని భావించిన వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. సెఉటాలోకి చేరిన తర్వాత తినడానికి ఆహారం కూడా దొరకలేదని పలువురు వలసదారులు వాపోతున్నారు. రోజుల తరబడి తాగు నీటితోనే కాలం గడిపామని చెబుతున్నారు. స్థానిక దుకాణాలు మూసివేయడం, తెరిచి ఉన్న చోట్ల కూడా ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. మొరాకోలోని ఫెజ్ నగరానికి చెందిన బేకరీ కార్మికుడు బ్రాహిమ్ మాట్లాడుతూ, "యూరప్ చేరితే జీవితం మారిపోతుందని అనుకున్నా. కానీ సెఉటాలో తినడానికి ఏమీ దొరకలేదు. కొన్ని రోజులు నీళ్లతోనే బతికాం. చివరకు తిరిగి రావడం తప్ప మరో మార్గం కనిపించలేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

స్థానికుల నుంచి వ్యతిరేకత?
కొంతమంది వలసదారులు సెఉటాలో స్థానికుల నుంచి కూడా ప్రతికూల స్పందన ఎదురైందని చెబుతున్నారు. తమను అనుమానంతో చూశారని, కొందరు అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు.. మొరాకో సరిహద్దు పట్టణం ఫ్నిదెక్ కొన్ని రోజుల క్రితం యూరప్ వెళ్లాలనే ఆశతో వచ్చిన జనంతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలామంది తమ ప్రయత్నాలను విరమించుకుని స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. దీంతో అక్కడి వీధులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

సెఉటాలో భారీ భద్రత
సెఉటాలో ప్రస్తుతం భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. కేఫేలు, దుకాణాలు తిరిగి తెరుచుకుంటున్నప్పటికీ పరిస్థితిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా చేరడంతో తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు సామర్థ్యానికి మించి నిండిపోయాయని అధికారులు తెలిపారు. అయితే, కొందరు వలసదారులు మాత్రం ఇంకా ఆశను వదల్లేదు. సూడాన్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ వంటి వారు సెఉటాలోనే ఉండి యూరప్ చేరేందుకు మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తమ దేశాల్లోని యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగం కంటే ఇక్కడి కష్టాలే మెరుగని వారు అంటున్నారు.

67 మంది మృతి.. కట్టుదిట్టమైన భద్రత
స్పెయిన్ అధికారుల ప్రకారం, గురువారం నుంచి ప్రారంభమైన భారీ వలస ప్రవాహంలో దాదాపు 50 వేల మంది భూమి, సముద్ర మార్గాల ద్వారా సెఉటాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది ఆఫ్రికా నుంచి యూరోపియన్ యూనియన్ భూభాగంలోకి జరిగే అతిపెద్ద సామూహిక ప్రవేశ ప్రయత్నాల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిలో 48 వేల మందికి పైగా 48 గంటల్లోనే తిరిగి మొరాకోకు వెళ్లిపోయారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఈ సామూహిక సరిహద్దు దాటే ఘటనలో కనీసం 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత సెఉటా సముద్ర సరిహద్దులో తేలియాడే భద్రతా అడ్డంకి (Floating Barrier) ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే అక్రమ వలసలను అరికట్టేందుకు మొరాకోతో కలిసి సంయుక్త చర్యలను వేగవంతం చేస్తున్నారు.

ఈయూ అత్యవసర సమావేశం
ఇదిలా ఉండగా.. సెఉటా ఘటన మరోసారి యూరప్‌లో అక్రమ వలసల సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది. ఈ భారీ వలస సంక్షోభంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. బయటి సరిహద్దుల రక్షణకు సమన్వయ చర్యలు అవసరమని 22 సభ్య దేశాలు కోరాయి. ఈ సంక్షోభంపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ అంతర్గత వ్యవహారాల మంత్రుల అత్యవసర వీడియో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఐర్లాండ్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement