ఫ్రాన్స్, స్పెయిన్‌లలో వ్యాపిస్తున్న దావానలం
రెండు దేశాల్లో 3.30 లక్షల బాధితులు
ఎండల తీవ్రతతో మరింత పెరగొచ్చని ఆందోళన
పారిస్: ఫ్రాన్స్, స్పెయిన్‌లలో వడగాడ్పులు కొనసాగుతుండటంతో కార్చిచ్చు మరింత తీవ్ర రూపం దాల్చింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు కనీసం 3.30 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లోని సుమారు 4 వేల మందిని ఖాళీ చేయించినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 2.20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సుమారు 420 చదరపు కిలోమీటర్ల మేర మంటల్లో దహించుకుపోగా, మంటలు మరింతగా వ్యాపించకుండా ప్రస్తుతానికైతే అదుపు చేయగలిగామన్నారు.
వేసవి తీవ్రత, పొడి వాతావరణం పెరుగుతుండటంతో కార్చిచ్చు ప్రమాదం పూర్తిగా తొలిగిపోనట్లేనని వారు తెలిపారు. ముందు జాగ్రత్తగా, లకనౌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్యాంపుసైట్లు, హాలిడే విలేజెస్, టూరిస్ట్ నివాసాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నామన్నారు. మంటలను అదుపు చేసే విధుల్లో ఇప్పటివరకు 93 మంది ఫైర్ ఫైటర్లు గాయపడ్డారన్నారు. అదేవిధంగా, స్పెయిన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు వ్యాపిస్తోందని ప్రభుత్వం తెలిపింది. వడగాడ్పులు కొనసాగుతుండటంతో మంటలు కూడా విస్తరిస్తున్నాయని, వాటిని నిలువరించేందుకు మిలటరీ ఎమెర్జెన్సీ విభాగాల సాయంతో వందలాదిమంది ఫైర్ ఫైటర్లు నిరంతరం శ్రమిస్తున్నాయని వెల్లడించింది. అధికారులు ఇప్పటి వరకు 79 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరో 30 వేల మందిని ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో మొట్టమొదటి సారిగా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. రాజధాని మాడ్రిడ్‌కు పశి్చమాన భారీ కార్చిచ్చు ఒకటి విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు, కస్టెల్లోన్‌లో మంటల వ్యాప్తితో పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. కొండప్రాంతం అవిలాలో రికార్డు స్థాయిలో మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మంటలు 500 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని భస్మీపటలం చేశాయని అధికారులు తెలిపారు. ఇంతటి తీవ్ర స్థాయిలో కార్చిచ్చును ఇప్పటి వరకు తాము చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


