ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా నియామకం
పారిస్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. 1998 ప్రపంచకప్, 2000 యూరో చాంపియన్‌షిప్ విజేత జట్టు సభ్యుడు, స్టార్ ప్లేయర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా... ఆ తర్వాత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు సాధించిన జిదాన్... 2030 వరకు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 14 ఏళ్లుగా ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన దీదీర్ డెషాంప్స్ పదవీకాలం ఇటీవలి ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో అతడి స్థానంలో 54 ఏళ్ల జిదాన్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది.
డెషాంప్స్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు 2018లో వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్... తాజా వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. ‘చాలా ఉత్సుకతతో ఉన్నా. ఫ్రాన్స్ జట్టు మిమ్మల్ని కలలు కనేలా చేస్తుంది. మా జట్టులో అసాధారణమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ అవకాశం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా. అందుకే చాలా భావోద్వేగంగా ఉంది. నేను ఎప్పుడూ ఈ జట్టుకు అభిమానినే. రియల్ మాడ్రిడ్ తర్వాత ఫ్రాన్స్ జట్టుకు మాత్రమే కోచ్‌గా పనిచేయాలనుకున్నా. అందుకే చాలా ఇతర అవకాశాలను వదులుకున్నా.
ఇన్నాళ్లు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన డెషాంప్స్ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దాన్ని కొనసాగించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని జిదాన్ పేర్కొన్నాడు. జిదాన్ శిక్షణలో ఫ్రాన్స్ జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఫిలిప్ డయల్లో ఆశాభావం వ్యక్తం చేశారు. జిదాన్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు సెపె్టంబర్ 25న టర్కీతో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న స్వదేశంలో ఇటలీతో ఫ్రాన్స్ తలపడనుంది.
‘రెడ్‌కార్డ్’తో కెరీర్ ముగింపు
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ జట్టుకు అభిమానులను సాధించి పెట్టడంలో జిదాన్ ప్రధాన పాత్ర పోషించాడు. 1998 ప్రపంచకప్‌లో జిదాన్ ప్రదర్శనను ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పటికీ మరవలేరు. డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో జిదాన్ రెండు ‘హెడర్’ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను ఒంటిచేత్తో టైటిల్ కట్టబెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఫ్రాన్స్‌కు యూరో కప్ అందించడంలోనూ అతడి పాత్ర కీలకం. 2004లో కెరీర్‌కు వీడ్కోలు పలికిన జిదాన్... ఆ తర్వాత అందరి అభ్యర్ధన మేరకు తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఫ్రాన్స్ జట్టు 2006 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

అయితే తుదిపోరులో ఇటలీ ఆటగాడు మార్కో మాటెరాజీ స్లెడ్జింగ్‌కు పాల్పడటంతో అతడి ఛాతీపై తలతో గుద్దినందుకు గానూ జిదాన్ ‘రెడ్ కార్డ్’కు గురయ్యాడు. ఆ మ్యాచ్‌తోనే అతడి కెరీర్ ముగియగా... ఫైనల్ ‘షూటౌట్’లో ఫ్రాన్స్ పరాజయం పాలైంది. ఓవరాల్‌గా 12 ఏళ్ల కెరీర్‌లో జాతీయ జట్టు తరఫున 108 మ్యాచ్‌లాడిన జిదాన్ 31 గోల్స్ చేశాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్ అవతారమెత్తిన అతడు... 2016–2021 మధ్య రియల్ మాడ్రిడ్ క్లబ్‌ను అజేయ శక్తిగా తీర్చిదిద్దాడు.


