టీమిండియాకు గుడ్‌బై చెప్పిన గంభీర్‌ స్నేహితుడు | BCCI parts ways with Ryan ten Doeschate, T Dilip | Sakshi
Sakshi News home page

టీమిండియాకు గుడ్‌బై చెప్పిన గంభీర్‌ స్నేహితుడు

Jul 28 2026 8:55 PM | Updated on Jul 28 2026 8:55 PM

BCCI parts ways with Ryan ten Doeschate, T Dilip

source: BCCI X

భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.

ఇటీవల ముగిసిన ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల సమయంలోనే ఇద్దరి కాంట్రాక్టు గడువు పూర్తయిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వారి ఒప్పందాలను ఇకపై కొనసాగించడం లేదని తెలిపారు.

గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో భారత జట్టుతో చేరిన డష్కటే రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ కాలం జట్టుతో ప్రయాణించే బాధ్యతను కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.

భారత జట్టు నుంచి వైదొలిగిన అనంతరం డష్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉంది. 

డష్కటే గంభీర్‌కు ఆప్త మిత్రుడు. వీరిద్దరికి ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడిన రోజుల్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు స్నేహం​ కొనసాగించారు. డష్కటే టీమిండియా కోచ్‌ కావడానికి గంభీరే ప్రధాన కారకుడు.

మరోవైపు, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది.

ఫీల్డింగ్ కోచ్ పదవికి సుభదీప్ ఘోష్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన కొంతమంది కోచ్‌లు, మాజీ క్రికెటర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement