చైనాలో ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన భర్త పుర్రెకు తీవ్ర గాయం కావడంతో, ఆ మెదడుకు కలిగిన తీవ్రమైన నష్టాన్ని తగ్గించడానికి ఒక మహిళ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రతిరోజూ అతని కాలివేళ్లను కొరుకుతూనే ఉంది. అదేంటి విచిత్రంగా అనుకుంటున్నారా? అసలు ఏమైంది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
చైనాకు చెందిన సాంగ్ మెయి (Song Mei) అనే మహిళ, తన భర్త జావో జిన్‌కియాన్ (Zhao Jinqian) మెదడు దెబ్బతిని ఏడేళ్లుగా కోమా (vegetative state)లో ఉండగా, వైద్యుల సలహా మేరకు ఆయన నరాలను ఉత్తేజపరిచేందుకు ప్రతిరోజూ ఆయన కాలి వేళ్లను కొరుకుతూ సపర్యలు చేసింది. ఆమె చేసిన ఈ అంకితభావం వల్ల భర్త కోలుకుని "ఐ లవ్ యూ" అని మాట్లాడటంతో ఈ వార్త వైరల్ అయింది. స్టోరీ ఏంటంటే..
2019 అక్టోబర్‌లో, వాటర్‌ప్రూఫింగ్ కార్మికుడైన జావో జిన్‌కియాన్ ఒక గిడ్డంగి పైకప్పుపైకి ఎక్కి, అందులో చిక్కుకున్న ఒక పసిబిడ్డను రక్షించాడు. మూడేళ్ల చిన్నారిని సురక్షితంగా కిందకు తీసుకువస్తుండగా, సుమారు 6 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.కానీ బిడ్డకు దెబ్బ తగలకుండా తన బాడీని అడ్డంగా పెట్టాడు. దీంతో ఆ బిడ్డకు ఎలాంటి గాయం కాలేదు కానీ జావో తలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అంతను కోమాలోకి వెళ్లిపోయాడు. సీటీ స్కాన్ సమయంలో అతనికి కొద్దిసేపు స్పృహ తిరిగి వచ్చినప్పుడు, బిడ్డ క్షేమంగా ఉందా? అడిగి మళ్లీ స్పృహ తప్పిపోయాడు.
ఆయన మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చిచెప్పారు. కానీ అతని నరాల్లో చలనం (నరాల ఉద్దీపన) అతని పాదాలను తాకుతూ ఉత్తేజపరుస్తూ ఉండాలని సూచించారు. దీంతో సాంగ్ అతని కాలివేళ్లను మెల్లగా కొరికినప్పుడు, వాటిలో ఒక చిన్న స్పందనను గమనించింది. అంతే ఆ రోజే తన ఉద్యోగాన్ని వదిలేసి, అతని పక్కనే ఉంటూ, అతనికి స్నానం చేయిస్తూ, మసాజ్ చేస్తూ, ప్రతిరోజూ అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆమె అతని పాదాన్ని ఒక ప్లాస్టిక్ సంచితో కప్పి, ఏడు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అలాగే చేసింది. వారి ఇద్దరు పిల్లల పోషణ కోసం తన సొంత చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ గడిపింది.
ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్
ఎట్టకేలకు ఏళ్ల తరబడి ఆమె చేసిన సేవలు ఫలించాయి! జావో నెమ్మదిగా స్పందించడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ 30న ఝావో తన భార్యవైపు , "సాంగ్ మే, లవ్ యూ అని మెల్లిగా గుసగుసలాడటంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చికిత్స సమయంలో, అతను పలకగలిగే ఏకైక పదం ఆమె పేరే. దీంతో అతను తొందరలోనే సాధారణ స్థితికి వస్తాడనే ఆశలు చిగురించాయి.
సోషల్ మీడియా స్పందన
నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సాంగ్ మెయ్ అంటూ నెటిజన్లు కొనియాడుతుండగా, జావో ధైర్యం , ఆయన భార్య త్యాగం మానవత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ దంపతులు చాలా సాదాసీదాగా, దయాగుణంతో ఉండేవారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, ఒక మారుమూల కొండ ప్రాంతానికి చెందిన విద్యార్థి చదువుకు స్పాన్సర్ చేసేవారు. కిండర్‌గార్టెన్ ఆర్ట్ టీచర్‌గా పనిచేసే సాంగ్ పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా పెయింటింగ్ పాఠాలు చెప్పేదట.
ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!


