థాయ్‌లాండ్ రాజకుమారి యువరాణి బజ్రకితియాభా(47) మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆమె మరణం కేవలం రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా దేశ రాజ్యాంగ రాజరిక వ్యవస్థ భవిష్యత్తు, సింహాసన వారసత్వం మరియు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే కీలక పరిణామంగా మారింది. దాదాపు మూడున్నరేళ్లకు పైగా కోమాలో చికిత్స పొందిన అనంతరం ఆమె కన్నుమూయడంతో థాయ్ రాజవంశ భవిష్యత్తుపై కొత్త చర్చలు మొదలయ్యాయి.
డిసెంబర్ 2022లో సైనిక శునకాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం మెదడు, గుండె మరియు ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమె కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో చికిత్స కొనసాగించినప్పటికీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. గత కొన్ని నెలలుగా పరిస్థితి మరింత విషమించడంతో చివరకు ఆమె మరణించినట్లు రాజభవనం అధికారికంగా ప్రకటించింది.
1978 డిసెంబర్ 7న జన్మించిన బజ్రకితియాభా.. ‘ప్రిన్సెస్ భా’గా పేరొందారు. థాయిలాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (Maha Vajiralongkorn)మొదటి భార్య సోమ్‌సావాలి పెద్ద కుమార్తె బజ్రకితియాభా. ఆమె కేవలం రాజకుమారిగా మాత్రమే కాకుండా, ఉన్నత విద్యావంతురాలు, న్యాయవాది, దౌత్యవేత్తగా కూడా గుర్తింపు పొందారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న ఆమె.. బ్రిటన్, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించడమే కాకుండా, ఆస్ట్రియా, స్లోవేకియా, స్లోవేనియాలకు థాయ్ రాయబారిగా కూడా పనిచేశారు. మహిళా ఖైదీల హక్కులు, న్యాయ సంస్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐక్యరాజ్యసమితి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అందుకే థాయ్ ప్రజల్లో ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉండేది.
రాజవంశానికి పెద్ద దెబ్బ..
యువరాణి బజ్రకితియాభా మరణం థాయ్ రాజవంశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న House of Chakri రాజవంశంలో అత్యంత సమర్థురాలిగా, ప్రజాదరణ కలిగిన సభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. భవిష్యత్తులో రాజ ప్రతినిధిగా లేదా రాజకుటుంబ పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించేవారు. ప్రస్తుతం థాయ్ సింహాసన వారసత్వ వ్యవస్థలో ప్రధానంగా రాజు దీపాంగ్‌కోరన్ రాష్మిజోటి(Prince Dipangkorn Rasmijoti) పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రజా జీవితంలో పెద్దగా చురుకుగా లేకపోవడం వల్ల భవిష్యత్తు నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బజ్రకితియాభా జీవించి ఉంటే రాజవంశ స్థిరత్వానికి కీలక ఆధారంగా నిలిచేవారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం తర్వాత రాజకుటుంబంలో భవిష్యత్తులో ఎవరు కీలక పాత్ర పోషిస్తారనే అంశం మళ్లీ చర్చకు వచ్చింది.
244 ఏళ్ల చరిత్ర..
కాగా, థాయ్‌లాండ్‌లో రాజరిక వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. రాజును కేవలం దేశాధినేతగా కాకుండా జాతీయ ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. దాదాపు 244 ఏళ్ల చరిత్ర కలిగిన రాజ కుటుంబానికి సంబంధించిన అంశాలు దేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంటాయి. రాజకుటుంబాన్ని అవమానించే చర్యలపై కఠినమైన "లెజ్ మజెస్టే" చట్టాలు అమలులో ఉన్నాయి. అందువల్ల రాజవంశ వారసత్వానికి సంబంధించిన ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం థాయ్‌లాండ్‌కు ఒక చారిత్రక మలుపుగా భావిస్తున్నారు. ఒకవైపు ప్రజాదరణ పొందిన రాజకుమారిని దేశం కోల్పోగా, మరోవైపు రాజవంశ భవిష్యత్తు నాయకత్వం, వారసత్వ రాజకీయాలపై కొత్త చర్చలకు తెరలేచింది. థాయ్ రాజకీయాలు, రాజరిక వ్యవస్థ భవిష్యత్తుపై ఈ పరిణామం దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


