ట్రంప్‌ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది! | Trumps Voting Fraud Bombshell Falls Flat, What Records Reveal About Non-Citizen Voting In US Elections | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!

Jul 27 2026 1:25 PM | Updated on Jul 27 2026 1:38 PM

Trumps Voting Fraud Bombshell Falls Flat: Records Tell a Different Story

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్‌ వాదిస్తున్నారు. అందుకే సేవ్‌ అమెరికా యాక్ట్‌(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్‌ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 

ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.

అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.

ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. 

మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.

మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement