ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. లైంగిక నేరాల అభియోగాలు, ప్రముఖులతో సంబంధాలతో వివాదాస్పదంగా మారిన ఎప్‌స్టీన్.. 2019లో జైలులో అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. అయితే ఇప్పటికీ ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ రూపంలో ఆ పేరు నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన వందల కోట్ల ఆస్తి మీద రాసిన వీలునామా తెరపైకి వచ్చింది. ఆ వీలునామాలో కరీనా షులియాక్ అనే పేరు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అసలు ఆమె ఎవరు? ఎప్‌స్టీన్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది? అనే ప్రశ్నలు చర్చకు దారి తీశాయి.
లైంగిక నేరాల ఆరోపణలతో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఎప్‌స్టీన్ మరణం తర్వాత.. అతడి కోట్లాది డాలర్ల ఆస్తులకు వారసురాలిగా ఓ మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే బెలారస్‌కు చెందిన దంత వైద్యురాలు కరీనా షులియాక్ (Karyna Shuliak). ఎప్‌స్టీన్ తన జీవితంలోని చివరి ఎనిమిదేళ్లలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో కరీనా ఒకరు. 2019లో జైలులో ఎప్‌స్టీన్ ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు మార్చిన వీలునామాలో.. తన ఆస్తులకు ప్రధాన లబ్ధిదారుగా ఆమె పేరును చేర్చినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి.
ఎప్‌స్టీన్ ఆస్తుల విలువ ఒక దశలో దాదాపు 100 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ దీవులు, పెట్టుబడులు, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఆమెకు ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆమె అతని సీక్రెట్ గర్ల్‌ఫ్రెండ్ అనే ఓ రూమర్ తరచూ వినిపిస్తుంటుంది.
ఆమెకు 21.. అతనికి 58
బెలారస్‌లో దంత విద్య అభ్యసించిన కరీనా.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఇంగ్లిష్ నేర్చుకుంటూ, దంత సహాయకురాలిగా పనిచేస్తున్న సమయంలో ఎప్‌స్టీన్‌తో పరిచయం ఏర్పడింది. కరీనా షులియాక్, జెఫ్రీ ఎప్‌స్టీన్ తొలిసారి 2011లో కలుసుకున్నారు. అప్పటికి కరీనా వయసు 21 ఏళ్లు కాగా.. ఎప్‌స్టీన్ వయసు 58 సంవత్సరాలు.
దర్యాప్తు పత్రాల ప్రకారం.. ఎప్‌స్టీన్ ఆమెకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, చదువుకు సహాయం చేస్తానని చెప్పడం ద్వారా దగ్గరయ్యాడు. మొదట్లో అతడి సహాయాన్ని అంగీకరించేందుకు కరీనా సంకోచించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
చిన్నప్పటి నుంచే దంత వైద్యురాలు కావాలని కలలు కన్న కరీనా.. అమెరికాలో తన చదువును కొనసాగించాలని భావించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మెడిసిన్‌లో చేరేందుకు ఆమె ప్రయత్నించగా.. తొలుత తిరస్కరణ ఎదురైనట్లు సమాచారం. ఆ తర్వాత ఎప్‌స్టీన్ తన పరిచయాలను ఉపయోగించి ఆమె అడ్మిషన్‌కు సహకరించినట్లు పత్రాలు వెల్లడించాయి. కొలంబియా యూనివర్సిటీకి సుమారు 2.10 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అనంతరం కరీనా దంత విద్య పూర్తి చేసి.. అమెరికాలో పలు ప్రాంతాల్లో డెంటిస్ట్‌గా పనిచేసేందుకు లైసెన్స్‌లు పొందారు.
గ్రీన్‌కార్డ్ కోసం వివాదాస్పద వివాహం!
అమెరికాలో స్థిరపడే క్రమంలో కరీనాకు ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురయ్యాయి. ఆమె స్టూడెంట్ వీసా గడువు ముగియడంతో దేశంలో ఉండటం కష్టంగా మారింది. ఈ సమయంలో ఎప్‌స్టీన్ ఓ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి. 2013లో తనకు పరిచయమైన ఓ వ్యక్తితో కరీనాకు వివాహం జరిపించినట్లు సమాచారం. ఈ వివాహం ద్వారా కరీనాకు అమెరికా గ్రీన్‌కార్డ్ లభించింది. అనంతరం 2018లో ఆమె అమెరికా పౌరసత్వం పొందారు. అయితే ఈ వివాహం నిజమైనదా? లేక ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు తర్వాత వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా అధికారులు ఆమె పౌరసత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎప్‌స్టీన్‌కు ‘ఫేవరెట్’గా..
దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్‌స్టీన్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కనిపిస్తారు. ఎప్‌స్టీన్ ఆమెను తన “ఫేవరెట్” అని పిలిచేవాడని పలు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వినియోగం ఉండేది. ప్రయాణాలు, జీవన ఖర్చులు, కుటుంబ అవసరాలకు ఎప్‌స్టీన్ భారీగా డబ్బు ఖర్చు చేశాడు. రికార్డుల ప్రకారం.. వారి సంబంధ సమయంలో కరీనాకు దాదాపు 10 లక్షల డాలర్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులకు కూడా బెలారస్‌లో డబ్బు పంపినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో కరీనా ఎప్‌స్టీన్ వ్యక్తిగత వ్యవహారాల్లో కీలకంగా మారారు. అతడి ఇళ్లలో సిబ్బంది నిర్వహణ, మరమ్మతులు, కొనుగోళ్లు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేవారని పత్రాలు చెబుతున్నాయి.

అక్కడా డెంటల్ క్లినిక్!
ఎప్‌స్టీన్‌కు చెందిన అమెరికా వర్జిన్ ఐలాండ్స్‌లోని ప్రైవేట్ దీవి లిటిల్ సెయింట్ జేమ్స్‌లో కూడా కరీనా కోసం డెంటల్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడ ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు దర్యాప్తు రికార్డులు సూచిస్తున్నాయి. ఎప్‌స్టీన్ నివాసాల నిర్వహణలోనూ ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.
నేరాల గురించి ఆమెకు తెలుసా?
దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్‌స్టీన్ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. అతడి లైంగిక నేర కార్యకలాపాల్లో ఆమె భాగస్వామి అని నిర్ధారించే ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ ఇతర యువతులతో ఉన్న సంబంధాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొన్ని ఈమెయిల్స్ సూచిస్తున్నాయి. అయితే వాటి నుంచి దూరంగా ఉండాలని మాత్రమే కోరినట్లు తెలుస్తోంది.

చివరి ఫోన్ కాల్ కూడా ఆమెకే!
2019లో అరెస్టైన తర్వాత.. జైలు నుంచి ఎప్‌స్టీన్ చివరిగా మాట్లాడిన వ్యక్తుల్లో కరీనా ఒకరు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఆ సంభాషణలో కేసు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగవచ్చని, తాను బలంగా ఉండాలని ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోన్ కాల్ జరిగిన కొద్ది రోజులకే.. 2019 ఆగస్టు 10న జైలు గదిలో ఎప్‌స్టీన్ మృతిచెందాడు.
అజ్ఞాత జీవితం, మళ్లీ..
ఎప్‌స్టీన్ మరణం తర్వాత కరీనా కొంతకాలం ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. అయితే తన దంత వైద్య వృత్తిని కొనసాగించారు. 2025లో న్యూయార్క్‌లో డెంటిస్ట్‌గా పనిచేసేందుకు లైసెన్స్ పొందారు. బ్రూక్లిన్‌లోని ఓ చిన్న క్లినిక్‌లో “డాక్టర్ కరీనా”గా పనిచేసినట్లు సమాచారం. అయితే ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన భారీ స్థాయిలో పత్రాలు విడుదల కావడంతో.. ఆమె గత జీవితం మరోసారి వెలుగులోకి వచ్చింది.
చివరికి.. ఎప్‌స్టీన్ ఆస్తి మొత్తం ఆమె చేతికి వస్తుందా? లేక బాధితుల పరిహారానికి వెళ్తుందా? అనేది న్యాయ ప్రక్రియలపై ఆధారపడి ఉంది. లైంగిక నేరాల బాధితులకు పరిహారం చెల్లింపులు, న్యాయ ప్రక్రియల కారణంగా ఈ మొత్తం సంపద పూర్తిగా ఆమె చేతికి అందుతుందా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. అదే గనుక జరిగితే ఆమె చేతికి చిల్లిగవ్వ కూడా దొరకదు!.


