భారతదేశ విద్యా వ్యవస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వివాదాలు, కుదుపులకు లోనైంది. ఎన్‌డీఏ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనా కాలంలో నలుగురు వేర్వేరు మంత్రులు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ, వారిలో ముగ్గురు కనీసం మూడేళ్లు కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఐదేళ్ల పూర్తి కాలం పని చేసినప్పటికీ, చివరికి ‘నీట్’ పరీక్షల లీకేజీలు, చెలరేగిన దేశవ్యాప్త నిరసనల సెగతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు విద్యాశాఖను చుట్టుముట్టిన సంచలన వివాదాలివే..
మారిన పేర్లు.. రద్దయిన ఎఫ్‌వైయూపీ
2014 మే 26 నుంచి 2016 జూలై 5 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ) బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ హయాంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆమె పదవీకాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) రద్దు చేయడం ఒకటి. దీనివల్ల విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ముసాయిదా రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ రేంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను ఆమె ప్రారంభించారు.
జేఎన్‌యూ వివాదాలు, రోహిత్ వేముల ఆత్మహత్య
స్మృతి ఇరానీ పదవీకాలం అనేక రాజకీయ తుఫాన్లకు కేంద్రబిందువుగా మారింది. జేఎన్‌యూలో చెలరేగిన భారీ నిరసనలు, నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అలాగే 2016 జనవరిలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభుత్వంపై తీవ్ర నైతిక ఒత్తిడి తెచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2016 జూలైలో ఆమెను విద్యాశాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు బదిలీ చేశారు.
ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి.. ఎన్‌టీఏ ఏర్పాటు
స్మృతి ఇరానీ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవదేకర్ 2016 జూలై 5 నుంచి 2019 మే 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)యాక్ట్-2017’ ద్వారా ఐఐఎం సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి లభించింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ)ను ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో నీట్ పేపర్ లీక్ అంశంలో ఇదే ఎన్‌టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
నో డిటెన్షన్ పాలసీ రద్దు.. సీబీఎస్ఈ పేపర్ లీక్
జవదేకర్ హయాంలో విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి, ఐదు, ఎనిమిది తరగతుల్లో పిల్లలను ఫెయిల్ చేయకుండా పై తరగతులకు పంపే ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేశారు. అయితే 2018లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల పేపర్ లీక్ కావడంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా, జియో ఇన్‌స్టిట్యూట్‌కు ‘ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కట్టబెట్టడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది.
నిశాంక్ హయాంలో జాప్యమైన కీలక నియామకాలు
2019లో ప్రకాష్ జవదేకర్ స్థానంలో డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో 2020 జూలైలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ఆమోదం పొందడం ఒక మైలురాయిగా నిలిచినా, దాని రూపకల్పనలో సింహభాగం అంతకుముందే పూర్తయింది. అయితే ఆయన కాలంలో జెఎన్‌యూ, బీహెచ్‌యూ, ఢిల్లీ వర్సిటీ వంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలకు నెలల తరబడి వైస్‌చాన్సలర్ల నియామకాలు జరగలేదు. అలాగే ఐదు ఐఐటీ సంస్థలకు పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించడంలో తీవ్ర జాప్యం జరిగింది. అనారోగ్య కారణాలరీత్యా ఆయన 2021 జూలైలో పదవికి రాజీనామా చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాక.. జాతీయ స్థాయిలో సంక్షోభాలు
రమేష్ పోఖ్రియాల్ నిష్క్రమణ తర్వాత విద్యాశాఖ పగ్గాలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పటికీ, ఆయన కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్ మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు వంటి అంశాలపై మేధావులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
‘నీట్’ తుఫాన్.. పదవిని కోల్పోయిన మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ కుంభకోణం, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డెక్కేలా చేశాయి. సుప్రీంకోర్టు జోక్యం, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎన్‌టీఏ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పరీక్షల మాఫియా అంతుచూస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనలు, ఆందోళనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే..


