చర్మసంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం దినచర్యకు మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, పరిసరాలు, ఆహారం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుందట. జస్ట్ ఇంట్లోనే సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు, మాస్క్‌లు, సన్‌స్క్రీన్‌లు వంటి చర్మసంరక్షణ చర్యలు పరిమితం కాదని అంటున్నారు నిపుణులు. విమాన ప్రయాణాల్లో కూడా చర్మ సంరక్షణ తప్పనిసరని చెబుతున్నారు.
ఇటీవల నటి త్రిష కృష్ణన్ విమానంలో షీట్ మాస్క్‌తో కనిపించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇలా ప్రియాంక చోప్రా వంటి అనేకమంది సెలబ్రిటీలు గతంలో మాస్క్‌తో తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు కూడా. ఇలా ఫ్లైట్‌జర్నీలో ఫేస్ మార్క్‌షీట్‌లు ఉపయోగించడం తప్పనిసరా? అంటే..
విమాన ప్రయాణాలలో షీట్ మాస్క్‌లను ఉపయోగించడం సురక్షితమేనని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అయితే ముఖానికి వేసుకునే మాస్క్ రకంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా విమానం క్యాబిన్ లోపల ఉండే పొడి వాతావరణంలో, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లు లేదా జెల్ ఆధారిత మాస్క్‌లు చర్మానికి తాత్కాలికంగా తేమను అందిస్తాయని అన్నారు.
హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్స్, గ్లిజరిన్, అలోవెరా, పాంథెనాల్ వంటి పదార్థాలు ఉన్న మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఎక్స్‌ఫోలియేటింగ్ రసాయనాలు, చార్‌కోల్ మాస్క్‌లు, బలమైన క్రియాశీల పదార్థాలు, పీల్-ఆఫ్ మాస్క్‌లు, క్లే మాస్క్‌లను ఉపయోగించవద్దని ఈ చర్మవ్యాధి నిపుణురాలు సలహా ఇచ్చారు.
కలిగే లాభాలు..
ఇది చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా చేస్తుంది.
చర్మం బిగుతుగా ఉందన్న భావనను తగ్గిస్తుంది.
అలాగే చర్మాన్ని మృదువుగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది.
విమానం క్యాబిన్‌లోని తక్కువ తేమ వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చర్మసంరక్షణకు ఎంతో మంచివి.
అలాగే వాటిపై సూచించిన విధంగా అన్ని నిమిషాలే ఉంచాలని, ఆ తర్వాత మిగిలిని సీరమ్ చర్మంలోకి వెళ్లేలా సున్నితంగా మసాజ్ చేయాలని అంటున్నారు. దీంతోపాటు రెండు చుక్కల ఫేషియల్ సీరమ్‌ను అప్లై చేసి, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను వాడితో మంచిది.
ఎవరికి మంచిది కాదంటే..
ఏమైనా చర్మ సమస్యలు ఉంటే ఉపయోగించకపోవడమే మంచిది.
సున్నితమైన చర్మం ఉన్నవారు షీట్ మాస్క్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది
అలాంటి వాళ్లు మాయిశ్చరైజర్‌ను మాత్రమే ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
చివరగా విమాన ప్రయాణంలో ఇలాంటి చర్మ సంరక్షణ దినచర్య కొంచెం అదనంగా అనిపించవచ్చు, కానీ ఇది చర్మాన్ని చికాకు, చర్మ సమస్యలు, పర్యావరణ కారకాల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు.
(చదవండి: అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..)


