న్యూఢిల్లీ: కొన్నిరోజుల పాటు సాగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన ప్రదర్శన ముగిసిన దరిమిలా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) జంతర్ మంతర్ నిరసన ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి భారీ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. నిరసన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలు, శిథిలాలు, తాత్కాలిక నిర్మాణాలను తొలగించడానికి 500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించారు. నిరసనకారులు శనివారం సాయంత్రం ఆందోళన విరమించి ఖాళీ చేసిన వెంటనే ఈ శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో పాటు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ నిరసన ముగిసింది.
రౌండ్-ది-క్లాక్ పనుల్లో 500 మందికి పైగా కార్మికులు
జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పారిశుద్ధ్య కార్మికులను భారీగా మోహరించినట్లు ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. నిరసన వేదిక వద్ద మిగిలిపోయిన చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, బ్యానర్లు, టెంట్లు తదితర సామగ్రిని తొలగిస్తున్నారు. నిరసన ఆనవాళ్లు లేకుండా చేసి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
రంగంలోకి లారీలు, యంత్ర పరికరాలు
పనులను వేగవంతం చేయడానికి ఎన్డీఎంసీ లారీలు, ఆటో-టిప్పర్లు, గోబ్లర్ యంత్రాలతో సహా యాంత్రీకృత శుభ్రపరిచే పరికరాలను వినియోగిస్తోంది. సైట్ నుంచి నిర్మాణ వ్యర్థాలు, రాళ్లు, ఇతర శిథిలాలను తొలగించడానికి సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి అదనపు సిబ్బందిని కూడా కేటాయించారు. నిరసన సమయంలో రద్దీగా ఉండే జంతర్ మంతర్ రోడ్డు, టాల్స్టాయ్ మార్గ్, జై సింగ్ రోడ్డు, సంసద్ మార్గ్, కన్నాట్ ప్లేస్ పరిసరాలలో ఈ పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతోంది.
బారీగా వ్యర్థాల తొలగింపు
గత రెండు రోజులుగా నిరసన ప్రాంతం నుంచి కొన్ని టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఎన్డీఎంసీ వెల్లడించింది. ఆందోళన కొనసాగిన కొద్దీ చెత్త పరిమాణం విపరీతంగా పెరగడంతో కార్మికులు, యంత్రాలను రౌండ్-ది-క్లాక్ మోహరించి పనులు ముమ్మరం చేశారు.


