జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు! | Health Crisis Deepens at CJP Protest in Delhi Infections and Dehydration Surge | Sakshi
Sakshi News home page

జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు!

Jul 25 2026 11:20 AM | Updated on Jul 25 2026 11:26 AM

Health Crisis Deepens at CJP Protest in Delhi Infections and Dehydration Surge

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నీట్-యూజీ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న ఆందోళనకారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత, వర్షం, రద్దీతో కూడిన వాతావరణంలో ఆందోళన కొనసాగిస్తుండటంతో పలువురు విద్యార్థులలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, గాయాలతో తల్లడిల్లిపోతూ వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని  వాలంటీర్ వైద్యులు తెలిపారు.

నిరసనకారులు రోజంతా బహిరంగ ప్రదేశాల్లోనే గడుపుతూ, నేలపైనే నిద్రపోతున్నారని, సరైన విశ్రాంతి, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ‘ఫైవ్ రివర్స్ హార్ట్ అసోసియేషన్’ వాలంటీర్ డాక్టర్ శిల్ప మాట్లాడుతూ, ఇప్పటికే 200 మందికి పైగా జ్వరం, గొంతునొప్పి, తలనొప్పికి మందులు అందించినట్లు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న వృద్ధులు కొందరు తమ దీర్ఘకాలిక మందులను పోగొట్టుకోవడంతో, మధుమేహం, రక్తపోటు సమస్యలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కిక్కిరిసిన జనసమూహం మధ్య దగ్గు, తుమ్ములు వంటి వాటి ద్వారా ఇన్‌ఫెక్షన్‌లు వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్య బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

భోజనం సరిగా చేయకపోవడం వల్ల ఆందోళనకారులలో నీటి శాతం తగ్గిపోయి (డీహైడ్రేషన్) వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి వాలంటీర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సమీప వైద్య కళాశాలల వైద్యులు కూడా తమ విధులను ముగించుకుని ఇక్కడ సేవలు అందిస్తున్నారు. పౌరులు సైతం మందులు, ప్రథమ చికిత్స సామగ్రిని విరాళంగా అందజేస్తున్నారు.

మరోవైపు తొక్కిసలాటల్లో గాయపడిన వారు, నొప్పులతో వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జూలై 20 నాటి నిరసనలో గాయపడిన కొందరు వెంటనే చికిత్స తీసుకోకపోవడంతో గాయాలు ఇన్‌ఫెక్షన్‌గా మారినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement