చర్చల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ! | Big Twist in Talks: CJP Stuns Centre Over Pradhans Resignation Demand | Sakshi
Sakshi News home page

చర్చల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!

Jul 25 2026 10:47 AM | Updated on Jul 25 2026 10:56 AM

Big Twist in Talks: CJP Stuns Centre Over Pradhans Resignation Demand

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.

సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.

‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’
నీట్‌ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్‌పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.

రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలత
ఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

  • శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్‌

  • పేపర్‌ లీక్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్‌

ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది.

రాజీనామాకు నో?
మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీ
ప్రధాన్‌ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement