ఆరు రోజుల తర్వాత.. అమర్‌నాథ్ యాత్ర షురూ! | Amarnath Yatra Resumes After Six-Day Weather Suspension | Sakshi
Sakshi News home page

ఆరు రోజుల తర్వాత.. అమర్‌నాథ్ యాత్ర షురూ!

Jul 25 2026 8:33 AM | Updated on Jul 25 2026 8:33 AM

Amarnath Yatra Resumes After Six-Day Weather Suspension

శ్రీనగర్‌: భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత ఆరు రోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. జమ్ము నుంచి కశ్మీర్ లోయలోని బాల్తాల్ బేస్ క్యాంపునకు 6,000 మందికి పైగా యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరిందని అధికారులు తెలిపారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో సహా మొత్తం 6,269 మంది యాత్రికులతో కూడిన 18వ బృందం 223 వాహనాల కాన్వాయ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:40 గంటలకు బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరింది. అయితే పహల్గామ్ మార్గంలో ఎలాంటి వాహనాల కాన్వాయ్‌ను పంపలేదని అధికారులు వెల్లడించారు.

లోయవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా జూలై 19న పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జూలై 2న భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడత యాత్రికులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 57 రోజుల పాటు కొనసాగే ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 3.7 లక్షలకు పైగా భక్తులు పవిత్ర గుహను దర్శించుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది.
 

యాత్రికుల సౌకర్యార్థం రెండు మార్గాలను అందుబాటులో ఉంచారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ వద్ద నున్వాన్ నుంచి ప్రారంభమయ్యే సాంప్రదాయ మార్కం సుమారు 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక గందర్‌బాల్ జిల్లాలోని బాల్తాల్ మీదుగా వెళ్లే రెండో మార్గం కొంచెం చిన్నదిగా, 14 కిలోమీటర్ల పొడవుతో నిటారుగా ఉంటుంది.

మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మాతా వైష్ణో దేవి యాత్ర కూడా జూలై 19 నుంచి జమ్ముకశ్మీర్‌లో తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ శాఖ  హెచ్చరికల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైష్ణో దేవి యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement