న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అస్సలు సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.
వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్‌చుక్‌ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.
వాంగ్‌చుక్ నిర్ణయం సరైంది కాదు
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్‌చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్‌చుక్‌ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్‌చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్‌చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్‌చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్‌చుక్‌ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.
అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


