చంబా: హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా సుమో వాహనంపై భారీ బండరాయి పడటంతో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గిరిజన ప్రాంతమైన పాంగి లోయలోని కిల్లార్-ఉదయ్‌పూర్ రహదారిపై ఉన్న కడునాలా వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండచరియ విరిగిపడటంతో వాహనం పూర్తిగా దెబ్బతింది.
సమాచారం అందిన వెంటనే అధికారులు, పోలీసులు స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాహనంలో డ్రైవర్‌తో కలిపి మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారి మూసివేత కారణంగా ప్రయాణికులంతా రాత్రి.. తిండిలోనే బస చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మార్గం పునరుద్ధరించబడిన తర్వాత వారు పాంగికి బయలుదేరారు.
అయితే, కడు నాలా వద్దకు చేరుకోగానే కొండపై నుండి ఒక్కసారిగా భారీగా శిథిలాలు, రాళ్లు పడటంతో టాక్సీ వాటి కింద చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సరిహద్దు రోడ్ల సంస్థ (BRO) సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టి శిథిలాల మధ్య చిక్కుకున్న గాయపడిన వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.


