రాధాకృష్ణులు.. ఇప్పటికీ అక్కడే! రాత్రయితే.. చిన్న చీమ కూడా ఆ ప్రాంతం దాటదు! | What is the secret of the Jawalaji Temple of Himachal Pradesh | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణులు.. ఇప్పటికీ అక్కడే! రాత్రయితే.. చిన్న చీమ కూడా ఆ ప్రాంతం దాటదు!

Jun 23 2026 6:58 PM | Updated on Jun 24 2026 6:54 PM

What is the secret of the Jawalaji Temple of Himachal Pradesh

ఎన్నెన్నో ఆధ్యాత్మిక వింతలకు భారతదేశం ఆలవాలం. పూరీజగన్నాథుడి ఆలయంపై ఉండే ధ్వజం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాజీ ఆలయంలో చమురు లేకుండానే దీపం వెలుగుతుంది. ఇలా సైన్స్‌కు కూడా అంతు చిక్కని విశేషాలెన్నెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే.. రాధాకృష్ణులు, గోపికలు రోజూ విహరించే ప్రదేశం ఒకటుంది. ఆ ప్రాంతంలో అన్నీ వింతలే.. చెట్ల కొమ్మలు ఆకాశంవైపు కాకుండా.. భూమివైపుగా పెరుగుతాయి. సైన్స్ కూడా హైపోథెసిస్ వరకే పరిమితమై.. అజెంప్షన్లతో ప్రకటనలు చేసిందే గానీ.. నిగూఢ రహస్యాలను ఛేదించలేకపోయింది. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలోని బృందావనంలో కనిపించే నిధివన్ అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక వింతల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజూ రాత్రి నిధివన్‌కు రాధాకృష్ణలు, గోపికలు చేరుకుంటారని భక్తుల విశ్వాసం. దట్టమైన అడవిలా ఉండే ఈ వనంలో ఉన్న రంగమహల్‌ కూడా అంతుచిక్కని రహస్యాలకు వేదికగా ఉంది. పూజారులు సాయంత్రం వేళలో ఈ మహల్‌లో రాధాకృష్ణుల కోసం ఓ మంచం వేసి, పక్కనే చందనం, లడ్డూలు, తాంబూలం, నీళ్ల బిందె, రాధమ్మ కోసం చీర, గాజులు, పండ్లు పెడతారు. ఆ తర్వాత మందిరం తలుపులకు తాళాలు వేస్తారు. ఉదయం 5 గంటలకు మందిరం తలుపులు తెరిచి చూస్తే.. ఆ మంచంపై ఎవరో పడుకున్నట్లు, నలిగిపోయి ఉంటుంది. నీళ్ల బిందెలో సగం నీళ్లు అయిపోయి కనిపిస్తాయి. తాంబూలం నమిలిన ఆధారాలు, సగం స్వీట్లు తిన్నట్లు అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తాయి. ఈ రహస్యాన్ని ఇప్పటికీ ఏ సైన్స్ కూడా ఛేదించకపోవడం గమనార్హం..!

నిధివన్ ఓ దట్టమైన అడవిలా ఉంటుందని మనం చెప్పుకొన్నాం కదా? అయితే.. ఇక్కడి చెట్లన్నీ వింతగా ఉంటాయి. ఎక్కడైనా చెట్ల శాఖలు.. అంటే కొమ్మలు సాధారణంగా పైకి ఆకాశంవైపు పెరుగుతాయి. కానీ, నిధివన్‌లో మాత్రం శాఖలు భూమివైపునకు వంగుతూ పెరుగుతాయి. అంతేకాదు.. నిధివన్‌ చెట్లలో మరో విశేషాన్ని చూడవచ్చు. ఎక్కడైనా చెట్లు ఒంటరిగా పెరుగుతాయి. ఇక్కడ మాత్రం చెట్లు జంటలుగా.. జోడీలుగా పెరుగుతాయి. రాత్రిళ్లు ఈ చెట్లన్నీ గోపికలుగా మారుతాయని, ఉదయం అవ్వగానే మళ్లీ చెట్లరూపంలోకి రూపాంతరం చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాదిపొడవునా ఇక్కడ ఆకుపచ్చటి చెట్లే కనిపిస్తాయి. ఎండిపోయిన కొమ్మలు కనిపించడం చాలా అరుదు. అయితే.. వృక్షశాస్త్రవేత్తలు మాత్రం నిధివన్‌లో ఉన్నవి సాధారణ తులసి చెట్లు కావని.. వనతులసి అని.. ఉత్తర మైదానాల్లోని కొన్ని ప్రత్యేక నేలల్లో ఉండే కెమికల్ కంపోజిషన్‌కు నీటికొరత తోడవ్వడం వల్ల కొమ్మలు పైకి కాకుండా.. కిందవైపునకు పెరుగుతున్నాయని ఒక అజెంప్షన్ మాత్రం వ్యక్తపరిచారు. అయితే.. ఇక్కడి చెట్లు ఒంటరిగా కాకుండా.. జంటగా పెరగడంపై ఇప్పటికీ శాస్త్రీయమైన కారణాలను చెప్పలేకపోయారు.

నిధివన్‌లో ఇంకో వింతను చూడవచ్చు. సాధారణంగా పగటిపూట ఈ వనంలో కోతులు సందడి చేస్తాయి. పక్షులు కిలకిలరావాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ, సాయంత్రం 7 దాటితే.. కోతులు, పక్షులు.. చివరకు ఉడతలు.. చిన్న చీమలు కూడా నిధివన్‌ను వీడి బయటకు వచ్చేస్తాయి. ఇందుకు కారణాలను సైన్స్ ఇప్పటకీ కనుక్కోలేకపోయింది. అయితే.. శతాబ్దాలుగా నిధివన్‌ను ఖాళీ చేయించడం వల్ల.. అక్కడి పక్షులు, జంతువుల్లో ఆ పద్ధతి సర్కేడియన్ రిథమ్‌గా మారడమో.. ఓ కండీషనల్ బిహేవియర్‌గా మారడమో జరిగి ఉండొచ్చనే సైకలాజికల్ థియరీల ఆధారంగా.. శాస్త్రవేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరైనా రాత్రివేళల్లో దొంగచాటుగా నిధివన్‌లోనికి వెళ్తే.. ఉదయానికి వాళ్లు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడమో.. కంటిచూపును కోల్పోవడమో.. బధిరులుగా మారిపోవడమో.. చనిపోవడమో జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.

నిధివన్ విషయంలో శాస్త్రీయ పరిశోధనల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. నిధివన్ మేనేజ్‌మెంట్ అందుకు అంగీకరించలేదు. స్థానికులు కూడా ఇలాంటి చర్యలను అడ్డుకుంటూ వస్తున్నారు. నిధివన్‌లో కెమెరాలు పెట్టడానికి స్థానికులు అంగీకరించరు. దీంతో.. ఇక్కడ పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదు. నిధివన్‌పై పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి. కొన్ని టీవీ చానళ్లు, రిసెర్చర్లు రాత్రివేళల్లో నిధివన్ సరిహద్దుల వెలుపల హై సెన్సిటివ్ ఆడియో రికార్డర్లు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను పెట్టి.. రికార్డింగ్‌కు ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రాంతం నుంచి రాత్రిళ్లు గజ్జెల సవ్వడి.. మహిళల గుసగుసలు వినిపించాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అవి గాలి శబ్దాలు లేదా హాల్యుజినేషన్ అవ్వొచ్చు అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా.. సైన్స్‌కు కూడా అంతుచిక్కని నిధివన్‌ను ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని వింతలువిశేషాలను మా నుంచి మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ చానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement