నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సంభవించిన స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జాతీయ భూకంప కేంద్రం నివేదిక ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆదివారం ఉదయం 5.33 గంటలకు 3.3 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ భూకంప కేంద్రం మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హత్గడ్ పర్వత శ్రేణుల వద్ద, భాన్‌వాడ్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాసిక్ నగరంతో పాటు సుర్గాణ, కల్వాన్, దేవళ, చాంద్వాడ్, పేట్, దిండోరి, నిఫాడ్ తాలూకాల్లో ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సుర్గాణ తాలూకాలోని భదర్, దిండోరి తాలూకాలోని నానాషి ప్రాంతాల్లోని కొన్ని నివాస గృహాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆనకట్టలను తనిఖీ చేయగా, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని నాసిక్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ సూచించారు. అయితే, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా గత జూలై 25 నుండి 28 వరకు, అలాగే ఆగస్టు 6న కూడా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ‘హనీమూన్ హత్యకేసు’: ఇండోర్‌లో సోదరుల అరెస్ట్


