కొత్తగా జాతీయ స్థాయి కమిటీని ప్రకటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)లో అప్పుడే అసంతృప్తి భగ్గుమంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి.. వ్యవస్థాపకుడికి సన్నిహితంగా ఉన్నవారికే కీలక పదవులు కట్టబెట్టారంటూ అహ్మదాబాద్‌కు చెందిన యువకుడు మణీష్ బ్రహ్మభట్ నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కోఆర్డినేటర్లు, వాలంటీర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసం ఎదుట కూడా నిరసన చేపట్టాడు.
సీజేపీ తన తొలి నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన మరుసటి రోజే ఈ వివాదం తెరపైకి వచ్చింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన పలువురు వాలంటీర్లు, కోఆర్డినేటర్లను నాయకత్వ ఎంపికలో పట్టించుకోలేదని బ్రహ్మభట్ ఆరోపించాడు. దీప్కేకు దగ్గరగా ఉన్నవారికే కొత్త కమిటీలో పదవులు దక్కాయని విమర్శించాడు. కోర్ కమిటీ సమావేశానికి తాను, మరికొందరు వాలంటీర్లు హాజరైనప్పటికీ.. సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని బ్రహ్మభట్ చెప్పాడు. రోజంతా అక్కడే ఉన్నప్పటికీ తమను లోపలికి పిలవలేదని, మొదట తాము సమావేశ ప్రదేశానికి రాలేదంటూ వాట్సాప్‌లో సమాచారం ఇచ్చారని ఆరోపించాడు. ఆ తర్వాత ఆశుతోష్‌ను సంప్రదించినా స్పందన రాలేదని పేర్కొన్నాడు.
సమావేశం జరుగుతున్న సమయంలో సభ్యుల ఫోన్లను బయటే ఉంచేడంతో తాము బయట వేచి ఉన్న విషయం లోపల ఉన్నవారికి తెలియలేదని కొందరు తర్వాత చెప్పినట్లు బ్రహ్మభట్ తెలిపాడు. మరుసటి రోజు ఉదయం రావాలని తమకు సూచించినట్లు చెప్పాడు. ఇక తాను ప్రతిపాదించిన ప్రచార కార్యక్రమాన్ని కూడా తనకు క్రెడిట్ ఇవ్వకుండా మరో పేరుతో ప్రారంభించారని బ్రహ్మభట్ ఆరోపించాడు. దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను చెప్పుకునేలా ‘ఏక్ రీల్ దేశ్ కే నామ్’ పేరుతో ప్రచారం నిర్వహించాలని తాను సూచించానని తెలిపాడు. అయితే అదే తరహా కార్యక్రమాన్ని సీజేపీ ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో ప్రారంభించిందని, తన ప్రతిపాదనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించాడు.
Chhatrapati Sambhajinagar, Maharashtra: Jantar Mantar protester Manish Brahmbhatt began a hunger strike over the CJP core committee dispute, alleging volunteers were excluded and only Abhijit Dipke’s close associates were included.
Manish Brahmbhatt, Ahmedabad youth sitting on… pic.twitter.com/jFsuRBNcyy— IANS (@ians_india) August 7, 2026
ఈ నేపథ్యంలో మరో సీజేపీ వాలంటీర్‌తో కలిసి అభిజిత్ దీప్కే ఇంటి ముందు బ్రహ్మభట్ నిరసనకు దిగాడు. జంతర్ మంతర్ ఉద్యమంలో పనిచేసిన కోఆర్డినేటర్లకు పార్టీ నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశాడు. మరోవైపు, ఛత్రపతి సంభాజీనగర్‌లోని దీప్కే నివాసంలో రెండు రోజుల పాటు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం సీజేపీ తన తొలి జాతీయ నాయకత్వాన్ని ప్రకటించింది. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను నేషనల్ కన్వీనర్‌గా నియమించగా.. చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్, స్పోక్స్‌పర్సన్ ఆశుతోష్ రంకాలను కో-కన్వీనర్లుగా నియమించింది.
అజింక్య షిండేను నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా, దీపక్ బలియాన్‌ను ఆర్గనైజేషన్ కో-ఇన్‌ఛార్జ్‌గా, ఆఫ్రీన్ నవాజ్‌ను నేషనల్ సెక్రటరీగా ప్రకటించింది. విజయ్ రెడ్డి మల్లంగి మీడియా లీడ్‌గా, రత్నా సింగ్ లీగల్ అఫైర్స్ లీడ్‌గా, వైష్ణవి గౌర్ రీసెర్చ్ అండ్ పాలసీ లీడ్‌గా, రోహన్ దేశ్‌పాండే టెక్నాలజీ లీడ్‌గా, యోగేశ్ ఇంగలే ఫైనాన్స్ లీడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య, పశ్చిమ జోన్లకు కూడా నాయకత్వ బాధ్యతలు కేటాయించారు.


