ఇక మటన్‌ ముక్కలు కాదు.. ఆకులు! | Scientists Engineer Lettuce and Tobacco Plants to Produce Animal Meat Protein | Sakshi
Sakshi News home page

ఇక మటన్‌ ముక్కలు కాదు.. ఆకులు!

Aug 8 2026 10:34 AM | Updated on Aug 8 2026 10:34 AM

Scientists Engineer Lettuce and Tobacco Plants to Produce Animal Meat Protein

లండన్‌: ప్లాంట్-బేస్డ్ మాంసం తయారీలో మరో ముందడుగు పడింది. ‘మాయోగ్లోబిన్’ అనే జంతు మాంస ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు తొలిసారిగా మొక్కలలో ఉత్పత్తి చేశారు. మొక్కల ఆకులలో నేరుగా ఈ ప్రోటీన్‌ను తయారు చేసేలా టొబాకో (పొగాకు), లెట్యూస్ (సలాడ్ ఆకు) మొక్కల జన్యువులను సవరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ‘ఫ్రాన్సియర్స్ ఇన్ ప్లాంట్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, తినదగిన  మొక్కలలో జంతు మాంస ప్రోటీన్‌ను స్థిరంగా ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్, కేంబ్రిడ్జ్ బయోటెక్ సంస్థ ‘క్యోమీ లిడ్’ పరిశోధకులు ఈ ప్రయోగం నిర్వహించారు. మొక్కల కణ కేంద్రకంలోని సాధారణ జన్యువుకు బదులుగా, కిరణజన్య సంయోగక్రియ జరిగే ‘క్లోరోప్లాస్ట్’ (హరిత రేణువు) లోపల ఈ మాయోగ్లోబిన్ జన్యువును ప్రవేశపెట్టారు. క్లోరోప్లాస్ట్‌లు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయగలగడంతో పాటు, మాంసానికి రుచినిచ్చే ‘హీమ్’ అనే పదార్థాన్ని కూడా అవే తయారు చేస్తాయి.

‘జీన్ గన్’ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ జన్యువులను మొక్కల ఆకులలోకి పంపారు. టొబాకో మొక్కలలో మాయోగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువగా నమోదైంది. అయితే, మొక్కలలో అవసరమైనంత ‘హీమ్’ సరిగ్గా అతుక్కోకపోవడం, సాధారణ గొడ్డు మాంసంతో పోలిస్తే దిగుబడి పది రెట్లు తక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఎదురయ్యాయి.

ఈ సాంకేతికత భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందితే, ప్లాంట్-బేస్డ్ మాంస తయారీ సంస్థలకు ఈ మొక్కల నుంచి సేకరించిన మాయోగ్లోబిన్‌ను ముడిసరుకుగా ఉపయోగించవచ్చు. అలాగే రక్తహీనతను నివారించేందుకు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్‌: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement