భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్ | Pakistani Ranger Salutes Indian Officer | Sakshi
Sakshi News home page

భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్

Aug 3 2026 11:37 AM | Updated on Aug 3 2026 11:41 AM

Pakistani Ranger Salutes Indian Officer

న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ భారత సైనిక ఉన్నతాధికారికి సెల్యూట్‌ చేస్తున్న వీడియో  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఓ పాకిస్థాన్ రేంజర్ భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారికి  సెల్యూట్ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రతిగా భారతీయ అధికారి కూడా ఆ సైనిక అభివాదనాన్ని స్వీకరించారు.

కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇది సైనిక వృత్తిపరమైన సంప్రదాయాలకు, దుస్తుల (యూనిఫాం) గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో జరిగే అధికారిక వేడుకలు, ఫ్లాగ్ మీటింగ్‌లు ఇతర సైనిక సదస్సుల సమయంలో ఇరు దేశాల సైన్యాలు అంతర్జాతీయ సైనిక నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలకు అతీతంగా హోదా, యూనిఫాంకు సముచిత గౌరవం ఇస్తారని తెలిపారు.

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇది భారత్ లేదా పాకిస్థాన్‌కు సంబంధించినది కాదు, యూనిఫాం ధరించిన సైనికుల మధ్య సీనియర్ అధికారికి దక్కే గౌరవం’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు. మరొకరు స్పందిస్తూ ‘ఇది కేవలం సైనిక సంప్రదాయానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. మరో వ్యాఖ్యలో ‘ఇలాంటి సమయాల్లో రాజకీయం కంటే సైనిక ప్రోటోకాల్‌దే పైచేయి అవుతుంది’ అని రాశారు. సైనిక నిబంధనల ప్రకారం ఎదుటి అధికారి ఉన్నత హోదాలో ఉంటే సెల్యూట్ చేయడం ఆనవాయితీ అని, సీనియర్ అధికారులు దాన్ని  మర్యాదపూర్వకంగా స్వీకరిస్తారని కొందరు స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఇది ఏ నాటిదనే దానిపై ఎలాంటి ధృవీకరణ లభించలేదు. దీంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
 


ఇది కూడా చదవండి: నా కల సొంతూరికి సర్పంచ్‌: అభిజీత్ దీప్కే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement