పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి | 14 Killed In Suicide Blast During Peace Rally In Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి

Aug 3 2026 5:30 AM | Updated on Aug 3 2026 5:30 AM

14 Killed In Suicide Blast During Peace Rally In Pakistan

14 మంది మృతి

పెషావర్‌: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్‌ ప్రావిన్స్‌లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్‌ జిల్లాలోని కబాల్‌ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్‌స్టేషన్‌ సమీపానికి రాగానే ఆత్మాహుతి బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఐదుగురు పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాలపాలైన మరో 15 మందిని ఆస్పత్రులకు తరలించారు. 

ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్‌ స్వాత్‌ అమన్‌ జిర్గా సారథ్యంలోని జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, కబాల్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని ప్రధాన గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement