లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శ్రావణ మాస కన్వర్ యాత్ర అత్యంత పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న వేళ, ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై బఢౌత్ కోత్వాలీ పరిధిలోని హిల్వాడీ గ్రామం సమీపంలో కన్వర్ యాత్రికులను ఓ ఫార్చ్యూనర్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు శివ భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నజఫ్‌గఢ్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే మీదుగా కాలిడకన హరిద్వార్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.
యాత్రలో ఇతర ముఖ్యాంశాలు..
ఉద్రిక్తత - ఆందోళన
మరోవైపు మంగళౌర్ కోత్వాలీ ప్రాంతంలో కారు కన్వర్‌ను ఢీకొన్న ఘటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహించిన కొందరు యాత్రికులు కారు డ్రైవర్‌పై దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేశారు.
భద్రత కోసం ఏటీఎస్ రంగప్రవేశం
యాత్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)ను రంగంలోకి దించింది. లక్నోలోని డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి హైటెక్ డ్రోన్ల ద్వారా ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ మళ్లింపులు
ఆగస్టు 3న ఉత్తరాదిన మొదటి శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని దేవాలయాల వద్ద ఏర్పడే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగ్రాలో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. కాసగంజ్ ప్రాంతంలో ఎస్పీ స్వయంగా రూట్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ దుకాణాలకు నోటీసులు జారీ చేయగా, బండా జిల్లాలో భారీ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ మళ్లింపులు అమలవుతున్నాయి. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకువచ్చే, వెళ్లే భక్తులతో ప్రస్తుతం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.


