ఇది చైనాకు సవాలా? భారత్‌కు అవకాశమా? | India-Japan Special Strategic And Global Partnership | Sakshi
Sakshi News home page

ఇది చైనాకు సవాలా? భారత్‌కు అవకాశమా?

Jul 11 2026 12:49 PM | Updated on Jul 11 2026 12:53 PM

India-Japan Special Strategic And Global Partnership

అభిప్రాయం

21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలను భూభాగాల కంటే సముద్రాలు, సరఫరా గొలుసులు (సప్లై చెయిన్స్‌), సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, అరుదైన ఖనిజాలు వంటి వ్యూహాత్మక వనరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రం ప్రపంచ భౌగోళిక–రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం, ఆసియా–యూరప్‌ వాణిజ్యంలో కీలక సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా సాగుతాయి. అందుకే అమెరికా, చైనా, భారత్, జపాన్‌ వంటి దేశాలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

భారత్‌కు హిందూ మహాసముద్రంలో సహజమైన వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా చైనా ‘స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌’ వ్యూహం ద్వారా పాకిస్తా¯Œ లో గ్వాదర్, శ్రీలంకలో హంబ¯Œ టోటా; జిబూతి, మయన్మార్‌ వంటి ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ తన ప్రభా వాన్ని విస్తరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, హిందూ మహా సముద్రంలోని సెషెల్స్, మారిషస్, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలతో సముద్ర భద్రత, తీరరక్షణ, బ్లూ ఎకానమీ రంగాల్లో సహ కారాన్ని విస్తరిస్తోంది. ఇటీవల సెషెల్స్‌తో కుదిరిన ఒప్పందాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. అదే సమయంలో జపాన్‌తో వ్యూహా త్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.

మనవైపు ఎందుకు చూస్తున్నట్లు?
మారుతున్న భద్రతా పరిస్థితులు జపాన్‌నే రక్షణ వ్యయాన్ని పెంచుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌ సహజమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా జపాన్‌కు కనిపిస్తోంది. ఇరుదేశాల భాగ స్వామ్య అసలు బలం పెట్టుబడుల్లో కాదు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో ఉంది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, రక్షణ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలలో భారత్‌–జపాన్‌లు కలిసి పనిచేస్తే ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇదే అంశం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పటివరకు పెద్ద వినియోగ మార్కెట్‌గా చూసిన చైనా, ఇప్పుడు అది ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాన్ని గమని స్తోంది. అందుకే సరిహద్దుల్లో ఒత్తిడిని కొనసాగిస్తూనే, భారత్‌ పూర్తిగా అమెరికా వ్యూహాత్మక వలయంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. 

మరోవైపు అమెరికా కూడా భారత్‌ను ఇండో–పసిఫిక్‌ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. అయితే అమెరికా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన భారత్, నేడు ‘మల్టీ–అలైన్‌మెంట్‌’ విధానంతో అమెరికా, జపాన్, యూరప్, రష్యా, గ్లోబల్‌ సౌత్‌ దేశాలతో సమతుల్య సంబంధాలను కొన సాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానం బలం. అయితే విదేశాంగ విధానానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నీతి ఆయోగ్‌ సూచిస్తున్నట్లుగా, భారత్‌ కేవలం అసెంబ్లింగ్‌ కేంద్రంగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన తయారీ కేంద్రంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో జపాన్‌ అత్యంత విశ్వసనీయ భాగస్వామి కావా లని ఆశించడంలో తప్పు లేదు.

భారత్‌–జపాన్‌లను చైనా వ్యతిరేక కూటమిగా మాత్రమే చూడటం సబబు కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలు, నియమాధా రిత అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత నౌకాయానం, సాంకేతిక సహకారం, ఆర్థిక భద్రతపై ఆధారపడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించాలంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నాయకత్వం అవ సరం. ఈ లక్ష్యాలను సాధించడంలో జపాన్‌తో భాగస్వామ్యం భారతదేశానికి ఒక చారిత్రక అవకాశం.

భారత్‌ ముందున్న అసలు సవాలు చైనా లేదా అమెరికా కాదు; తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకొని, ఆర్థిక–సాంకేతిక శక్తిగా ఎదగడం. అదే జరి గితే హిందూ మహాసముద్రంలో భారత్‌ ఒక ప్రాంతీయ శక్తిగానే కాదు, ప్రపంచస్థాయి ‘సంతులన శక్తి’గా అవతరిస్తుంది. అదే భారత్‌ – జపాన్‌ భాగస్వామ్యానికి నిజమైన విజయంగా చరిత్రలో నిలిచి పోతుంది.
- సీహెచ్‌.వి. ప్రభాకర్‌ రావు, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement