వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు.. | These Foods Must Stop Eating Prevent Stomach Infections In Rainy Season | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు..

Jul 10 2026 5:38 PM | Updated on Jul 10 2026 5:45 PM

These Foods Must Stop Eating Prevent Stomach Infections In Rainy Season

తొలకరి జల్లులతో హమ్మయ్యా అనేలా..భగభగ మండే ఎండల నుంచి చల్లటి ఉపశమనం కలిగించే ఆహ్లాదభరిత వాతావరణం ఇది. ఎంతో చల్లగా ఉండే ఈ సీజన్‌ ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే కాలం కూడా. అందువల్లే ఈ సీజన్‌లో తాజాగా వండిన భోజనం, సురక్షితమైన తాగు నీటిని ఎంచుకుంటేనే కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెచ్చని ఉష్ణోగ్రతల కలయికలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు పెరగడానికి సరైన సమయం ఇది. ఫలితంగా కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్‌ పాయిజనింగ్‌ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ ఏ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కాలంలో.  అందువల్ల ఎలాంటి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, అందుకోసం ఏం చేయాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

స్ట్రీట్‌ ఫుడ్‌..
వర్షాకాలంలో దూరంగా ఉండవలసిన అతిపెద్ద ఆహారాలలో వీధి ఆహారం ఒకటి. చాట్‌, పానీ పూరీలు, కోసిన పండ్లు, మూతపెట్టని చిరుతిళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఆహారాలు తదితరాలకు దూరంగా ఉండటం మంచిది. అమ్మకందారులు సురక్షితమైన నీటిని వినియోగించనట్లయితే..కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తాజాగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోవడమే సురక్షితమైందని సూచిస్తున్నారు.

పచ్చి ఆకు కూరలు, సలాడ్లు
పచ్చి ఆకుకూరలలో, ముఖ్యంగా వర్షాకాలంలో, మట్టితోపాటు పరాన్నజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. వాటిని సరిగ్గా కడగకపోతే, అవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. వండటం వల్ల వ్యాధులను కలిగించే చాలా సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు వండిన కూరగాయలను తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ సలాడ్లు తినాలనుకుంటే, వాటిని ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడిగి తీసుకోవడం మేలు. పండ్లు, కూరగాయలను బాగా కడిగే ముందు, వాటిని కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి తీసుకోవడం మరింత మంచిది.

తాజాగా లేని సముద్రపు ఆహారం
వర్షాకాలంలో సముద్రపు ఆహారాన్ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా చేపలకు సంతానోత్పత్తి కాలం. దాంతో ఈ సమయంలో, కలుషితం కావడం,పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని తినాలని ఎంచుకుంటే, అది తాజాగా, పూర్తిగా ఉడికించినదైతేనే తీసుకోవడం సురక్షితం. సరిగ్గా ఉడకని లేదా పాడైపోయిన సముద్రపు ఆహారం వల్ల ఆహార సంబంధిత అనారోగ్యాలు, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.

మిగిలిపోయిన..పాడైపోయిన ఆహారం
ఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన లేదా చాలా గంటల పాటు బయట వదిలేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది సురక్షితం కాదు. తప్పనిసరిగా ఆహారాన్ని నిల్వ చేయాల్సి వస్తే, దానిని త్వరగా రిఫ్రిజిరేటర్‌లో పెట్టి, తినే ముందు బాగా వేడి చేసుకోండి.

వేయించిన నూనెతో కూడిన ఆహారాలు
వర్షాకాలంలో ప్రజలు తరుచుగా పకోడాలు, సమోసాలు, ఇతర వేయించిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆహారాలు బరువుగా ఉండి, జీర్ణం కావడం కష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుంది.


చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు, పచ్చి ఆహారాలు
అధిక చక్కెర పానీయాలు , డెజర్ట్‌లు వాపుకు కారణం కావచ్చు. పైగా మొత్తం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగలవు. వర్షాకాలంలో బయట అమ్మే పచ్చి మొలకలు,ముందుగా కోసిన పండ్లకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే అవి బ్యాక్టీరియా వృద్ధికి సులభంగా నిలయాలుగా మారతాయి. బదులుగా, అరటిపండ్లు దానిమ్మపండ్లు వంటి తొక్క తీయగలిగే సీజనల్ పండ్లను ఎంచుకోవడం మేలు.

ఆరోగ్యకరమైన ఆహారపు చిట్కాలు

తేలికగా, పోషక విలువలతో, సులభంగా జీర్ణమయ్యే, తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు

బాటిల్‌లోని నీటిని లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే..వాటర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి లేదా క్లోరిన్ టాబ్లెట్‌ను కలపండి.

వీధి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.

గోధుమలు, పిండిచేసిన ధాన్యాలు సురక్షితమైనవి

పండ్లు, కూరగాయలను క్షుణ్ణంగా కడగి తీసుకోవడం మేలు

పచ్చి మొలకలు, కోసిన పండ్లకు దూరంగా ఉండండి: ఇవి బ్యాక్టీరియా వృద్ధికి నిలయాలుగా మారతాయి

శుభ్రమైన పాత్రలు, పళ్ళాలు వాడండి: వాటిని సబ్బుతో క్షుణ్ణంగా కడగండి

శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి: పుష్కలంగా ద్రవపదార్థాలు తాగండి

తరచుగా చేతులు కడుక్కోండి: ముఖ్యంగా తినడానికి ముందు, వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా చేతులు కడుక్కుని తినడం మంచిది. 

గమనిక: ఇది కేవలం అగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement