కడ్డి తంత్రి వాయిద్యం
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.
కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్‌కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.
ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!
– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు


